నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. మంగళవారం ఉదయం వందలాది మంది విద్యార్థులు తరగతులను బహిష్కరించి రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు.  

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. మంగళవారం ఉదయం వందలాది మంది విద్యార్థులు తరగతులను బహిష్కరించి రోడ్లపైకి వచ్చారు. సమస్యలపై చాలా కాలంగా నిరసన పట్టించుకోకపోవడంతోనే.. ఆందోళనను తీవ్రతరం చేసినట్టుగా విద్యార్థులు చెబుతున్నారు. హాస్టల్‌లో సౌకర్యాలు సరిగా లేవని.. సరైన వసతులు కల్పించాలని కోరుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన ల్యాప్‌టాప్‌లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తరగతులను బహిష్కరించి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. 

మరోవైపు బీఎస్పీ నేతలు కూడా విద్యార్థులకు మద్దతుగా ఆందోళనకు దిగారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని మెయిన్ గేటు వద్ద ధర్నాకు దిగారు. బాసర ట్రిపుల్ ఐటీని అస్తవ్యస్తంగా మార్చి విద్యార్థులను వేధిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. 

ఇక, గత కొంతకాలంగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో క్యాంటీన్‌ భోజనంలో పురుగులు కనిపించాయి. దీంతో విద్యార్థినులు డిన్నర్ బహిష్కరించి ఆందోళన చేపట్టారు. నిర్వాహకులు తమకు పురుగులు పట్టిన భోజనం పెడుతూ ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని విద్యార్థులు మండిపడ్డారు. మెస్ నిర్వాహకులపై చర్యలు తీసుకునేవరకు ఆందోళన చేస్తూనే ఉంటామని హెచ్చరించారు. 

మరోవైపు పదే పదే పవర్​కట్లతో నరకం చూస్తున్నామని విద్యార్థులు చెబుతున్నారు. నీటి సరఫరా కూడా సరిగాలేదని ఆరోపించారు. ట్యాంకర్లతో నీరు తెప్పిస్తున్నారని.. బకెట్లతో క్యూలో నిలబడి పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మెస్​మెనూ పాటించట్లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.