మంత్రి కొప్పుల, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి నిరసన సెగ .. అడ్డుకున్న విద్యార్ధులు, ఉద్రిక్తత (వీడియో)
పెద్దపల్లి జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలకు నిరసన సెగ తగిలింది. గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వచ్చిన వీరిని విద్యార్ధులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు విద్యార్ధులను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు.

పెద్దపల్లి జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలకు నిరసన సెగ తగిలింది. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న పురాతన భవనాన్ని కూల్చివేసి అదే స్థలంలో కోటి 20 లక్షల వ్యయంతో నూతన భవనం నిర్మించ తలపెట్టారు. ఈ భవనానికి శంకుస్థాపన చేయడానికి మంత్రి కొప్పుల ఈశ్వర్, స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వచ్చారు. ఈ క్రమంలో వీరిని విద్యార్థి సంఘ నాయకులతోపాటు బాలికల కళాశాల విద్యార్థులు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మంత్రి, ఎమ్మెల్యేతో పాటు గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్‌ను అడ్డుకునేందుకు యత్నించిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు.
ఈ సందర్భంగా విద్యార్ధినులు మాట్లాడుతూ బాలికల కళాశాల ఆవరణలో గ్రంథాలయ భవనం నిర్మించడం ఏంటని ప్రశ్నించారు. కళాశాలకు భవనం మంజూరు చేయించేది పోయి స్థానిక ఎమ్మెల్యే , గ్రంథాలయ భవనాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు తయారుచేసి శంకుస్థాపనకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని ఎట్టి పరిస్థితిలో తాము ఒప్పుకోబోమని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు గ్రంథాలయ భవనాన్ని వేరే చోటికి మార్చాలని వారు డిమాండ్ చేశారు. ఓవైపు విద్యార్థులు నిరసన చేస్తుండగానే మరోవైపు పోలీసుల సహాయంతో మంత్రి కొప్పుల ఈశ్వర్, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి హడావుడిగా గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేసి వెనుతిరిగి వెళ్లారు.