తెలంగాణ ఇంటర్‌బోర్డ్ మరోసారి వివాదంలో ఇరుక్కుంది. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల మూల్యంకనం సరిగా చేయలేదంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు నాంపల్లిలోని ఇంటర్‌బోర్డ్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.

అధికారులు సరిగా స్పందించడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 1,60,487 మంది విద్యార్ధులు హాజరవ్వగా... 60,600 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 37.76 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు.