ఐఐటీ హైదరాబాద్‌లో రాహుల్ అనే విద్యార్ధి ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. రాహుల్ మృతిపై అతని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే కుమారుడి మృతదేహాన్ని తమకు చూపించడం లేదని తండ్రి ఆరోపిస్తున్నారు.

సంగారెడ్డి జిల్లా కందీలోని ఐఐటీ హైదరాబాద్‌లో విద్యార్ధి ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. రాహుల్ అనే విద్యార్ధి క్యాంపస్‌లోనే ఈ బ్లాక్ 107 రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు అధికారులు. మరోవైపు రాహుల్ ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ల్యాప్‌టాప్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఐటీ నిపుణులు. ల్యాప్‌టాప్ ఓపెన్ అయితే అసలేం జరిగిందనే వివరాలు తెలిసే అవకాశం వుంది. మరోవైపు రాహుల్ స్నేహితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కాగా.. రాహుల్ మృతిపై అతని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ మృతదేహాన్ని తమకు చూపించడం లేదని తండ్రి ఆరోపిస్తున్నారు. రాహుల్ స్వస్థలం ఏపీలోని నంద్యాల జిల్లా.