హైదరాబాద్ కూకట్ పల్లిలో కొందరు విద్యార్థులు వీరంగం సృష్టించారు. పట్టపగలు నడి రోడ్డుపై సినిమా స్టైల్లో ఫైటింగ్ కు దిగారు. రెండే గ్రూపులుగా విడిపోయిన విద్యార్థులు ఒకరిపై ఒకరు పరస్పర దాడులకు దిగారు. దీంతో సంఘటనా స్థలంలో కొద్దిసేపు భయానక వాతావరణం ఏర్పడింది. 

కూకట్ పల్లిలోని పార్చూన్ బిజినెస్ స్కూల్ వద్ద ఈ ఉద్రిక్త సంఘటన చోటుచేసుకుంది. ఈ రెండు గ్రూపులకు చెందిన విద్యార్థులంతా అదే బిజినెస్ స్కూల్ విద్యార్థులుగా  తెలుస్తోంది. ఓ హోటల్లో పార్టీ చేసుకుంటుండగా వీరి మధ్య మాటా మాటా పెరిగి రోడ్డుపైకి వచ్చి కర్రలతో, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నట్లు సమాచారం. 

మొదట హోటల్ వద్దే గొడవకు దిగిన విద్యార్ధులు ఆ తర్వాత మళ్లీ కాలేజి వద్ద గొడవపడ్డారు. ఈ సమయంలో తమ వెంట కర్రలు, రాళ్లు తెచ్చుకుని పరస్పర దాడులకు పాల్పడుకుంటూ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. 

విద్యార్థుల రాళ్ల దాడిలో రోడ్డుపై వెళుతున్న ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకునేసరికి విద్యార్థులు పరారయ్యారు. దీంతో బాదిత మహిళ నుండి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ గొడవకు కారకులైన విద్యార్థులు గురించి సమాచారం సేకరిస్తున్నారు.

వీడియో

"