అమెరికాలో కాల్పుల్లో శరత్ మృతి, కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు

Student from Telangana shot dead in the USA
Highlights

అమెరికాలో కన్సాస్ నగరంలో వరంగల్ కు చెందిన తెలుగు విద్యార్థి శరత్ కొప్పు హత్యకు గురైన విషయం తెలిసిందే. గుర్తు తెలియని దుండగుడు శరత్ ను కాల్చి చంపాడు. పాయింట్ రేంజ్ లో గన్ తో కాల్చి చంపటంతో శరత్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. 
 

అమెరికాలో కన్సాస్ నగరంలో వరంగల్ కు చెందిన తెలుగు విద్యార్థి శరత్ కొప్పు హత్యకు గురైన విషయం తెలిసిందే. గుర్తు తెలియని దుండగుడు శరత్ ను కాల్చి చంపాడు. పాయింట్ రేంజ్ లో గన్ తో కాల్చి చంపటంతో శరత్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. 

అయితే శరత్ మృతిచెందిన వార్త తెలిసినప్పటి నుండి హైదరాబాద్ అమీర్ పేటలో నివాసముంటున్న అతడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు ఇలా అర్థాంతరంగా దేశం కాని దేశంలో దారుణ హత్యకు గురవడంతో ఆ తల్లి శోకానికి అంతు లేకుండా పోయింది. కొడుకు జ్ఞాపకాలను తలచుకుంటూ గత రెండు రోజులుగా ఏడుస్తూనే ఉంది. ఆమె పరిస్థితిని చూసి శరత్ ప్రెండ్స్ ని, బంధువులను కానీ కుటుంబాన్ని పరామర్శించడానికి రావద్దని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. మీడియాను సైతం వారు నివాసముండే జాగృతి ఎన్ క్లేవ్స్ లోకి అనుమతించడం లేదు.

మృతుడు శరత్ కొప్పు స్వస్థలం వరంగల్ లోని కొత్తవాడ అయినప్పటికి వీరి కుటుంబం మొత్తం హైదరాబాద్ లో నివాసముంటున్నారు. తండ్రి రామ్మోహన్ బీఎస్ఎల్ఎన్ ఉద్యోగి కాగా, తల్లి మాలతి వరంగల్ జిల్లా పర్వతగిరిలో పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి శరత్ తో పాటు ఓ కుమార్తె ఉంది. శరత్ ఇంజనీరింగ్ హైదరాబాద్ లోనే పూర్తి చేశాడు. ఆ తర్వాత మూడేళ్ల పాటు ఓ ప్రైవేట్ కంపనీలో ఉద్యోగం చేసి ఆరు నెలల క్రితమే మిస్సోరి యూనివర్సిటీ లో ఎంఎస్ సీటు రావడంతో అక్కడికి వెళ్లాడు.

శరత్ అమెరికాలో చదువుకుంటూనే కన్సాస్‌ నగరం ప్రాస్పెక్ట్స్‌ అవెన్యూలోని ఓ రెస్టారెంటులో తాత్కాలిక ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఇక్కడే ఇతడిపై ఓ నల్ల జాతీయుడు ఐదు సార్లు కాల్పులు జరిపి పారిపోయాడని సమాచారం.  తీవ్రంగా గాయపడిన ఇతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో అతడి స్నేహితులు హైదరాబాద్ లోని తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

ప్రస్తుతం శరత్ మృతదేహం అమెరికాలోనే ఉంది. కొడుకు మృతిచెంది రెండు రోజులవుతన్నా అతడి మృతదుహాన్ని కూడా కళ్లారా చూసుకోలేకపోతున్నామని తల్లిదండ్రులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత చదువుల కోసం ఇటీవలే అమెరికాకు వెళ్లిన కొడుకు ఇలా శవంగా తిరిగొస్తాడని అనుకోలేదంటూ విషాదాన్ని వ్యక్తపరుస్తున్నారు. శరత్ మృతదేహాన్ని తొందరగా స్వదేశానికి తీసుకువచ్చేలా చూడాలని బంధువులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

loader