రామన్నపేట: తోటి విద్యార్థుల హేళన ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అమ్మాయి చేతిలో ఓడిపోవడంతో తోటి విద్యార్థులు హేళన చేయడంతో మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

వివరాల్లోకి వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలోని ఓ ప్రైవేట్ స్కూల్లో క్లాస్‌ లీడర్‌ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో ఎనిమిదో తరగతి విద్యార్థి చరణ్ కుమార్ కూడా పోటీ చేశాడు. అయితే ఆ ఎన్నికల్లో చరణ్ కుమార్ ఓటమి పాలయ్యాడు. ఒక విద్యార్థిని చేతిలో చరణ్ ఓడిపోయాడు. 

క్లాస్ లీడర్ గా గెలవలేకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు చరణ్. స్కూల్ కి వెళ్లిన చరణ్ ఇంటికి వచ్చాడు. ఇంటి దగ్గర బుక్స్ బ్యాగ్ పెట్టేసి బయటకు వెళ్లిపోయాడు. రాత్రి 9గంటలైనా ఇంటికి రాకపోవడంతో అనుమానంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే  రామన్నపేట రైల్వేస్టేషన్‌ పరిధిలో గుర్తు తెలియని రైలు ఢీకొని ఓ బాలుడు మృతి చెందినట్లు స్థానిక పోలీసులకు రైల్వే అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో చరణ్ తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. 

మృతదేహం తమ కుమారుడిదేనని తల్లిదండ్రులు అంగీకరించారు. క్లాస్ లీడర్ గా పోటీ చేసి ఓడిపోయావని తోట విద్యార్థులు హేళన చేయడంతోనే చరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపించారు.