Asianet News TeluguAsianet News Telugu

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య.. ఘటన స్థలంలో సూసైడ్ నోట్..!

నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతున్న ఓ విద్యార్థి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ విద్యార్థిని పీయూసీ-2 చదువుతున్న భాను ప్రసాద్‌గా గుర్తించారు.

Student committed suicide in basara iiit
Author
First Published Dec 19, 2022, 9:42 AM IST

నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతున్న ఓ విద్యార్థి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మృతదేహం హాస్టల్ గదిలో ఉరికి వేలాడుతూ కనిపించింది. ఆ విద్యార్థిని పీయూసీ-2 చదువుతున్న భాను ప్రసాద్‌గా గుర్తించారు. భానుప్రసాద్ రంగారెడ్డి జిల్లా మంచాలకు చెందిన వ్యక్తి. వివరాలు.. ఆదివారం హాస్టల్ గదిలో భానుప్రసాద్ ఉరివేసుకుని వేలాడుతున్నాడని అతని స్నేహితులు చూసి కాలేజ్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనతో బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. వివరాలను సేకరించారు. 

విద్యార్థుల పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతారనే భయంతో పోలీసులు కొద్దిసేపు క్యాంపస్‌లో విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. భానుప్రసాద్‌ మృతదేహాన్ని క్యాంపస్‌ నుంచి నిర్మల్ ఆస్పత్రికి తరలించారు. వ్యక్తిగత కారణాలతోనే భానుప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కాలేజ్ అధికారులు చెబుతున్నారు. విద్యార్థి మృతిపట్ల వీసీ వెంకటరమణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

ఘటన స్థలంలో పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టుగా భానుప్రసాద్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్టుగా సమాచారం. అయితే సూసైడ్ నోట్ వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే పోస్టుమార్టమ్ రిపోర్ట్ కోసం పోలీసులు వేచిచూస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios