తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. నల్గొండలో ఓ విద్యార్థి అంబులెన్స్ లో వచ్చి మరీ పరీక్ష రాశాడు. 

నల్గొండ : నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ బకల్వాడ పదో తరగతి పరీక్ష కేంద్రానికి గౌతమ్ అనే విద్యార్థి అంబులెన్స్లో వచ్చి హాజరయ్యాడు. ఇటీవల రోడ్డు ప్రమాదం కారణంగా డాక్టర్లు గౌతం కాలుకు సర్జరీ చేశారు. పదోతరగతి పరీక్షలు రాయాలన్న తపనతో ఉన్న విద్యార్థి గౌతమ్ సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం సజ్జాపురం నుంచి అంబులెన్సులు పరీక్షా కేంద్రానికి వచ్చాడు.

ఇదిలా ఉండగా, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పదవతరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 240 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు మొత్తం 42003 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షా సెంటర్ల వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశ్నపత్రాలను ఓపెన్ చేశారు. 

తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి మే 23 నుంచి జూన్ 1 వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. 9:35 తర్వాత అంటే ఐదు నిమిషాలు దాటితే లోపలికి అనుమతించబోమని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేయడంతో విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు.

కరోనా కారణంగా గత రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించలేదు తెలంగాణ ప్రభుత్వం. ఈ యేడు నిర్వహిస్తున్న పరీక్షలకు ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాలను శానిటైజ్ చేయడం.. మాస్కులు, ఫిజికల్ డిస్టెన్స్ ను మెయింటేన్ చేయడంలాంటి కరోనా నిబంధలను పాటించడం.. ప్రతీచోటా శానిటైజర్లను అందుబాటులో పెట్టడం లాంటి అనేక జాగ్రత్తలు తీసుకున్నారు.