మహబూబాబాద్ జిల్లాలో కుక్కలు వీరంగం సృష్టిస్తున్నాయి. పిల్లల మీదే కాదు పెద్దలు, పశువుల మీద కూడా ఊరకుక్కలు దాడిచేసి గాయపరుస్తున్నాయి. ఓ వృద్ధురాలి మీద దాడి చేసి ముక్కు కొరికాయి.
మహబూబాబాద్ : తెలంగాణలో కుక్కల దాడుల ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. చిన్నారులపైనే కాదు వృద్ధులపై కూడా కుక్కలు దాడులు చేస్తున్న ఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెంకటాపురంలో వెలుగు చూసిన ఓ ఘటన కలకలం రేపింది. శీలం రాంబాయమ్మ అనే వృద్ధురాలి మీద కుక్కలు దాడి చేశాయి. ఆమె ఇంటి ముందు కూర్చుని ఉండగా ఒక కుక్క దాడి చేసి ముక్కుపై తీవ్రంగా కరిచింది.
ఈ హఠాత్పరిణామానికి ఆమె గట్టిగా కేకలు వేయడంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కుక్కను అదిలించి.. ఆమెను చికిత్స కోసం వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. రాంబాయమ్మ మీదే కాదు అదే గ్రామంలో మరో నలుగురు మీద కూడా కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. పశువుల మీద కూడా కుక్కలు దాడి చేసి గాయపరుస్తున్నాయి. కుక్కల దాడిలో గాయపడిన వారిలో శీలం సమ్మన్న, జ్యోతిలు కూడా ఉన్నారు.
నిజామాబాద్ లో నవీన్ హత్యలాంటి ఘటన.. తన ప్రేయసిని ప్రేమించాడని స్నేహితుడి హత్య...!!
ఇదిలా ఉండగా, రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలోని ఓ ఆసుపత్రిలో ఓ పసికందును వీధికుక్కలు తీసుకెళ్లి కరిచి చంపాయి. ఆస్పత్రిలోని టీబీ వార్డులో నెల వయసున్న చిన్నారి తన తల్లి పక్కనే నిద్రిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సోమవారం అర్థరాత్రి రెండు కుక్కలు ఆస్పత్రిలోని టీబీ వార్డులోకి వెళ్లాయని, వాటిలో ఒకటి పసిపాపతో తిరిగి వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజీలో తేలిందని పోలీసులు తెలిపారు. చిన్నారి తండ్రి క్షయ చికిత్స కోసం ఆస్పత్రిలో చేరినట్లు ఎస్‌హెచ్‌ఓ కొత్వాలి సీతారాం తెలిపారు.
అతనికి తోడుగా భార్య రేఖ.. తమ నెల వయసు చిన్నారితో సహా ముగ్గురు బిడ్డలతో ఆస్పత్రిలోనే ఉంది. చిన్నారి తల్లి గాఢనిద్రలో ఉండగా ఈ ఘటన జరిగిందని ఆయన చెప్పారు. ఘటన జరిగిన సమయంలో ఆస్పత్రి సిబ్బంది కూడా టీబీ వార్డులో లేరని అధికారి తెలిపారు. "మెడికల్ బోర్డు ద్వారా పోస్ట్ మార్టం నిర్వహించబడింది. తదుపరి విచారణ తర్వాత ఈ విషయంలో కేసు నమోదు చేయబడుతుంది," అని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. మరోవైపు ఆసుపత్రి యాజమాన్యం కూడా దీనిపై విచారణ ప్రారంభించింది.
"రోగి అటెండర్ నిద్రపోతున్నారు. ఆసుపత్రి గార్డు ఇతర వార్డులో ఉన్నాడు. సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని నేను చూడలేదు. విచారణ తర్వాత మాత్రమే నేను దీనిమీద మాట్లాడగలను" అని యాక్టింగ్ ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్ సిరోహి జిల్లా ఆసుపత్రి, వీరేంద్ర విలేకరులతో అన్నారు. రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలో ప్రభుత్వాసుపత్రిలో తల్లి పక్కనే నిద్రిస్తున్న నెల వయసున్న చిన్నారిని వీధికుక్క తీసుకువెళ్లి చంపిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. ఆసుపత్రి వార్డు బయట చిన్నారి మృతదేహం లభ్యమైనట్లు వారు తెలిపారు.
తన భార్య తనకు తెలియజేయకుండా ఖాళీ కాగితాలపై సంతకం చేసి, తన బిడ్డకు అంత్యక్రియలు నిర్వహించేలా ఆసుపత్రి అధికారులు, పోలీసులు బలవంతం చేశారని చిన్నారి తండ్రి ఆరోపించాడు "సోమవారం నన్ను ఆసుపత్రిలో చేర్చారు, వార్డులోకి కుక్కలు రావడంతో నేను వాటిని తరిమివేసాను, నా భార్య తెల్లవారుజామున 2 గంటలకు నిద్రలేచి, కుక్కలు మా బిడ్డను కరుస్తుండడం చూసింది. తెల్లారి, ఆసుపత్రి అధికారులు, పోలీసులు ఖాళీ కాగితాలపై నా భార్య సంతకం తీసుకున్నారు. నాకు సమాచారం ఇవ్వకుండానే నా కొడుకు అంత్యక్రియలు చేయించారు. నేను నా కొడుకు ముఖం కూడా చూడలేకపోయాను" అని మీనా చెప్పారు.
ఆసుపత్రి యాజమాన్యం కూడా ఈ విషయంపై విచారణ ప్రారంభించింది.ఈ ఘటనను ఖండిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ్ పురోహిత్ మాట్లాడుతూ ఈ దుర్ఘటనకు ఆస్పత్రి అధికారులే బాధ్యత వహించాలన్నారు. ఇది పూర్తిగా ఆసుపత్రి పాలకవర్గం వైఫల్యమని, ఆసుపత్రిలో వీధికుక్కలు సంచరిస్తున్నాయని, అయితే ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యేలు రాష్ట్రంలో వైద్య సదుపాయాల రూపురేఖలను మార్చేశారని ఆయన అన్నారు.
