హైదరాబాద్ లోని నాచారంలో వీధికుక్కలు మరో చిన్నారి మీద దాడికి దిగాయి. ఇంటిముందు ఆడుకుంటున్న ఆశ్రిత్ అనే విద్యార్థి మీద దాడిచేశాయి. 

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కలు చిన్నారుల మీద దాడి చేస్తున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. హైదరాబాద్ అంబర్పేట్లో నాలుగేళ్ల ప్రదీప్ అనే చిన్నారిని వీధి కుక్కలు దాడి చేసి, చంపేసిన ఘటన మరువకముందే అలాంటి ఘటనలే వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ నాచారంలో అలాంటి మరో ఘటన వెలుగులోకి వచ్చింది. నాచారంలోని మల్లాపూర్ గ్రీన్ హిల్స్ లో ఆశ్రిత్ అనే ఓ చిన్నారిపై వీధి కుక్క దాడి చేసింది. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై కుక్కలు దాడి చేసి కరిచాయి.

గేటు లోపల ఉన్న ఆ చిన్నారి అక్క అది చూసి అరవడంతో కుక్కలు అక్కడ నుంచి పరిగెత్తాయి. చిన్నారి కేకలు, అక్క అరుపులకు ఇంట్లో నుంచి వచ్చిన తల్లిదండ్రులు వెంటనే ఆశ్రిత్ ను ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి ఘటనే మంచిర్యాల జిల్లా మందమర్రిలోనూ వెలుగు చూసింది. ఇక పిచ్చికుక్కలు మూడు వేరువేరు చోట్ల పదిమంది మీద దాడి చేసి వీరంగం సృష్టించాయి. దాడిలో గాయపడిన వారిలో ఒక అమ్మాయి, ముగ్గురు పిల్లలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. శైలజ, సహస్ర ఇద్దరు పిల్లలపై వీధి కుక్కలు ఇంటిముందు ఆడుకుంటుండగా దాడి చేసి గాయపరిచాయి. 

విజయవాడ భవానిపురం లో ముగ్గురు పిల్లలపై కుక్కలు దాడి చేశాయి. స్థానికులు వెంటనే అలర్ట్ కావడంతో ప్రాణాలతో బయటపడ్డారు. కుక్కలు ఇంతలా వీరంగం సృష్టిస్తున్నప్పటికీ జంతు ప్రేమికులు వాటి మీద నియంత్రణకు అడ్డుగా నిలుస్తున్నారు. వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకున్న కోర్టు డైరెక్షన్ తో బెదిరింపులకు పాల్పడాలని చూస్తున్నారు.

తల్లిపొత్తిళ్లలోని నెలవయసు చిన్నారిని లాక్కెళ్లి.. కరిచి చంపిన వీధికుక్కలు.. జైపూర్ ఆస్పత్రిలో భయానక ఘటన..

ఇదిలా ఉండగా, రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలోని ఓ ఆసుపత్రిలో ఓ పసికందును వీధికుక్కలు తీసుకెళ్లి కరిచి చంపాయి. ఆస్పత్రిలోని టీబీ వార్డులో నెల వయసున్న చిన్నారి తన తల్లి పక్కనే నిద్రిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సోమవారం అర్థరాత్రి రెండు కుక్కలు ఆస్పత్రిలోని టీబీ వార్డులోకి వెళ్లాయని, వాటిలో ఒకటి పసిపాపతో తిరిగి వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజీలో తేలిందని పోలీసులు తెలిపారు.

చిన్నారి తండ్రి క్షయ చికిత్స కోసం ఆస్పత్రిలో చేరినట్లు ఎస్‌హెచ్‌ఓ కొత్వాలి సీతారాం తెలిపారు. తన ఇతర పిల్లలతో పాటు రోగికి చికిత్స చేస్తున్న చిన్నారి తల్లి గాఢనిద్రలో ఉండగా ఈ ఘటన జరిగిందని ఆయన చెప్పారు. ఘటన జరిగిన సమయంలో ఆస్పత్రి సిబ్బంది కూడా టీబీ వార్డులో లేరని అధికారి తెలిపారు. "మెడికల్ బోర్డు ద్వారా పోస్ట్ మార్టం నిర్వహించబడింది. తదుపరి విచారణ తర్వాత ఈ విషయంలో కేసు నమోదు చేయబడుతుంది," అని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. మరోవైపు ఆసుపత్రి యాజమాన్యం కూడా దీనిపై విచారణ ప్రారంభించింది. 

దారుణం.. ఆరేళ్ల చిన్నారిపై పెంపుడు కుక్క దాడి.. ముఖంపై 1000కి పైగా కుట్లు..

"రోగి అటెండర్ నిద్రపోతున్నారు. ఆసుపత్రి గార్డు ఇతర వార్డులో ఉన్నాడు. సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని నేను చూడలేదు. విచారణ తర్వాత మాత్రమే నేను దీనిమీద మాట్లాడగలను" అని యాక్టింగ్ ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్ సిరోహి జిల్లా ఆసుపత్రి, వీరేంద్ర విలేకరులతో అన్నారు. రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలో ప్రభుత్వాసుపత్రిలో తల్లి పక్కనే నిద్రిస్తున్న నెల వయసున్న చిన్నారిని వీధికుక్క తీసుకువెళ్లి చంపిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. ఆసుపత్రి వార్డు బయట చిన్నారి మృతదేహం లభ్యమైనట్లు వారు తెలిపారు.