గంజాయి సాగు చేస్తున్నట్టు తెలిసిన 148 మంది రైతులకు వచ్చే జూన్‌లో విడుదల చేయనున్న రైతు బంధు నిధులు ఆపేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ లేఖ రాసింది. నారాయణ ఖేడ్, మహబూబాబాద్, జహీరాబాద్, వరంగల్, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ప్రాంతాలకు చెందిన కొందరు రైతులు గంజాయి సాగు చేస్తున్న ఎక్సైజ్ శాఖ గుర్తించింది. గంజాయి పండిస్తున్న 148 మంది రైతులను గుర్తించింది. అందులో 121 మంది రైతులపై ఇప్పటికే కేసులు నమోదు చేసింది.
హైదరాబాద్: అన్నదాత కష్టాల్లో మునిగిపోకూడదని, ఆయనకు పెట్టుబడి సహాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు బంధు పథకం కింద ఎకరాకు ఐదు వేల రూపాయలు అందిస్తున్నది. ఈ పథకానికి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్నది. రైతుల్లోనూ ఈ పథకానికి విశేష ఆదరణ ఉన్నది. చాలా మంది రైతులు సాగులో పెట్టుబడి పెట్టడానికి ఈ పథకంపై ఆధారపడుతున్నారు. కానీ, కొందరు రైతులు ఈ పెట్టుబడిని పంటసాగుకు కాకుండా గంజాయి సాగుకు వినియోగిస్తున్నట్టు తేలింది. ఈ తప్పుదారిలో వెళ్తున్న గుప్పెడు మంది రైతులపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నది. సీఎం కేసీఆర్ కూడా ఈ విషయమై ఆగ్రహంగా ఉన్నారు. అలాంటి వారికి రైతు బంధు నిధులు కట్ చేయాలని నిర్ణయించారు. ఈ ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ రంగంలోకి దిగింది. వారిని గుర్తించే పనిలో పడింది.
నారాయణ ఖేడ్, మహబూబాబాద్, జహీరాబాద్, వరంగల్, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ప్రాంతాలకు చెందిన కొందరు రైతులు గంజాయి సాగు చేస్తున్న ఎక్సైజ్ శాఖ గుర్తించింది. గంజాయి పండిస్తున్న 148 మంది రైతులను గుర్తించింది. అందులో 121 మంది రైతులపై ఇప్పటికే కేసులు నమోదు చేసింది. అంతేకాదు, తాజాగా, ఈ రైతులకు రైతు బంధు నిధులు ఆపేయాలని ఎక్సైజ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ 148 మంది రైతుల వివరాలను ఆయా జిల్లాల కలెక్టర్లకు ఎక్సైజ్ శాఖ అందించింది. జూన్‌లో విడుదల కానున్న నిధులు వీరికి కట్ చేయాలని సూచనలు చేసింది. ఇదిలా ఉండగా, నల్గొండ, సూర్యాపేటలోనూ ఇలా గంజాయి సాగు చేస్తున్నట్టు ఎక్సైజ్ శాఖకు సమాచారం అందినట్టు తెలిసింది.
