హైదరాబాద్: మాజీ డీజీపీ అప్పారావు తన ఇంటి ముందు పెంచుకుంటున్న అరుదైన, ఖరీదైన బొన్సాయ్ మొక్క చివరకు దొరికింది. మొక్కను దొంగిలించిన నిందితుడిని హైదరాబాదులని జూబ్లీహిల్స్ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి మొక్కను స్వాధీనం చేసుకున్నారు. 

పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 18లో నివసిస్తున్న మాజీ డీజీపీ అప్పారావు, శ్రీదేవి దంపతులకు బొన్సాయ్ మొక్కల పెంపకంపై మక్కువ ఎక్కువ. దీంతో వారు కొన్నేళ్లుగా తమ ఇంటి ఆవరణలో అరుదైన బొన్సాయ్ మొక్కలను పెంచుతున్నారు. 

ఎస్సీఆర్ హిల్స్ ఓంనగర్ కు చెందిన గొల్లపూడి ప్రసన్నాంజనేయులు వాటిని తరుచుగా చూస్తూ ఉండేవాడు. వాటిని అమ్ముకుంటే డబ్బులు వస్తాయని ఆశపడ్డాడు. ఈ క్రమంలో స్నేహితుడు అభిషేక్ తో కలిసి గతంలో రెండుసార్లు ఇంటి ముందు ఉన్న మొక్కలను దొంగిలించి అమ్ముకున్నాడు. ఒక్కో మొక్కకు రూ.25 వేల ధర పలికాయి. 

దాంతో మరోసారి మరో మొక్కను దొంగిలించి అమ్ముకోవాలని పథకం వేశారు. ఇందులో భాగంగా ఈ నెల 10వ తేదీ ఉదయం బైక్ మీద వచ్చి సారూ జాతికి చెందిన బొన్సాయ్ మొక్కను దొంగిలించారు.

మొక్క కనిపించకపోవడంతో అప్పారా భార్య శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కృష్ణానగర్, యూసుఫ్ గుడా, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోని సీసీటీవీలను పరిశీలించారు. 

దాంతో మొక్కను తీసుకుని యూసుఫ్ గుడా వైపు బైక్ మీద వెళ్తున్న నిందితులు వారికి కనిపించారు. రెండు రోజుల పాటు గాలించిన తర్వాత నిందితులను పట్టుకున్నారు. ఆంజనేయులు గతంలో కూడా ఇక్కడ బొన్సాయ్ మొక్కలు చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు మరో నిందితుడు అభిషేక్ ను శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు.