హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ఇవాళ(శుక్రవారం) పూర్తయిందని... ఇక ఈ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పర్యవేక్షించాల్సిన బాధ్యత సాధారణ పరిశీలకులదేనని తెలంగాణ ఎన్నికల కమీషనర్ పార్థసారథి పేర్కొన్నారు. జిహెచ్ఎంసీ సర్కిళ్లు, జోన్ల వారిగా నియమించిన సాధారణ, వ్యయ పరిశీలకుల జాబితాను విడుదల చేసిన ఎస్ఈసీ వారితో సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ... ఎస్ఈసీ నియమించిన పరిశీలకులు ఎన్నికలు పూర్తయ్యేలోగా ఐదుసార్లు రిపోర్టులు సమర్పించాల్సి వుంటుందన్నారు. మొదటి రిపోర్టు ఇవాళ అంటే నామినేషన్ల చివరిరోజు, రెండోది పోలింగ్ కు మూడు రోజుల ముందు, మూడోది  పోలింగ్ తర్వాతి రోజు, నాలుగోది ఫలితాలు ప్రకటించిన తర్వాత, ఐదోది ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసిన తర్వాత ఇవ్వాల్సి వుంటుందన్నారు. అయితే ఇందులో పోలింగ్, కౌంటింగ్ ముగిసిన తర్వాత వారు ఇచ్చే రిపోర్టు చాలా కీలకమని...ఆ నివేదికల ఆధారంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్, కౌంటింగ్, ఫలితాల ప్రకటన తదితర విషయాలపై చర్యలు తీసుకుంటుందన్నారు. 

సాధారణ పరిశీలకులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో ఏం జరుగుతుందో  గమనిస్తూ వుండాలని... ఏదయినా అనుమానాస్పద కదలికలను గుర్తిస్తే సర్వైలెన్స్, వీడియో టీంలను పంపాలన్నారు. నామినేషన్ల ప్రక్రియ మొదలు ఉపసంహరణ, మోడల్ కోడ్ ఉల్లంఘన, పోస్టల్ బ్యాలెట్, ఓటర్ల జాబితా, పొలిటికల్ పార్టీల సమావేశాలు తదితర విషయాలపై వీరు దృష్టి పెట్టాలని ఎస్ఈసీ పార్థసారథి సూచించారు.