Asianet News TeluguAsianet News Telugu

ఎస్ఎస్సీ పేపర్ లీక్: బండి సంజయ్ పాత్రను గుర్తించారిలా....

పదో తరగతి హిందీ ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంలో బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మీద పోలీసులు కేసు నమోదు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, పోలీసులు ఆయన పాత్రను నిర్ధారించుకున్న తర్వాతనే అరెస్టు చేశారు.

SSC paper leak: Bandi Sanjay role detected like this
Author
First Published Apr 6, 2023, 8:59 AM IST

వరంగల్: పదో తరగతి ప్రశ్న పత్రం లీకేజీ కేసులో తొలి ముద్దాయిగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసులు చేర్చారు. ఆయన ప్రభుత్వం పరువు తీయడానికి కుట్ర చేశారని వరంగల్ ఎస్పీ రంగనాథ్ చెప్పారు. ఎస్ఎస్సీ ప్రశ్న పత్రం లీకేజీలో బండి సంజయ్ పాత్రను పోలీసులు ఎలా నిర్ధారించారనేది ప్రశ్న. ప్రశ్న పత్రం లీకేజీతో సంబంధం ఉన్న మహేష్, శివగణేశ్, ప్రశాంత్, మైనర్ బాలుడి వాంగ్మూలాలను పోలీసులు తీసుకున్నారు. వారి వాంగ్మూలాల ఆధారంగా బండి సంజయ్ పాత్రను పోలీసులు నిర్ధారించుకున్యనారు. 

కమలాపూర్ బస్ స్టాండ్ కు దగ్గరలో మహేష్, శివగణేష్ లను, ప్రశ్నపత్రాన్ని మొదట ఫోటో తీసిన మైనర్ బాలుడిని మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత ఆరెపల్లి బస్టాండ్ వద్ద ప్రశాంత్ ను పట్టుకున్నారు. వారి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి వాంగ్మూలాలన తీసుకున్నారు. ఆ తర్వాత రాత్రి 8 గంటల ప్రాంతంలో వారి అరెస్టును పోలీసులు ప్రకటించారు. వారి వాంగ్మూలాల ఆధారంగానే బండి సంజయ్ పాత్ర ప్రశ్న పత్రం లీకేజీలో ఉందని పోలీసులు గుర్తించారు.   

దాంతో బండి సంజయ్ ను మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ లో అదుపులోకి తీసుకున్న బండి సంజయ్ ను బొమ్మల రామారం పోలీసు స్టేషన్ కు తరలించారు. అనంతరం బుధరం ఉదయం 11.30 గంటల సమయంలో వదిలేశారు. అయితే, హిందీ ప్రశ్న పత్రం లీకేజీతో సంబంధం ఉందని నిర్ధారించుకున్న పోలీసులు బండి సంజయ్ ని పెంబర్ది ఆర్చ్ వద్ద కమలాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. బండి సంజయ్ ని ఆయన ఫోన్ గురించి అడిగారు. ఫోన్ లేదని ఆయన చెప్పారు. సంజయ్ ఫోన్ లోని వాట్సాప్ కాల్ వివరాలను తాము రాబడుతామని ఎస్పీ రంగనాథ్ అంటున్నారు. తన పాత్ర ఉంది కాబట్టే సంజయ్ ఫోన్ లేదని చెప్పారని ఆయన అన్నారు. 

ప్రశ్న పత్రం లీకేజీలో కేసులోని నిందితుల్లో ఒక్కడైన ప్రశాంత్ గతంలో ఓ టీవీ చానెల్ ప్రతినిధిగా పనిచేశాడు. ఇప్పుడు అతను బిజెపికి చెందిన నమోలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. బండి సంజయ్ కి సోషల్ మీడియా సలహాదారుడిగా పనిచేస్తున్నాడు. ప్రశాంత్ బిజెపి ముఖ్య నాయకులతో దిగిన ఫోటోలను మంత్రి హరీష్ రావు బయటపెట్టారు కూడా.

ఇదిలావుంటే, బండి సంజయ్ మీద పలు చోట్ల విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందీ ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంలో పోలీసులు పది మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో ఐదుగురు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారు పోగు సుభాష్, పోగు శశాంక్ అలియాస్ రింకు, దూలం శ్రీకాంత్, పెరుమాండ్ల శ్రామిక్ అలియాస్ నాని, పోతనబోయిన వర్షిత్ అలియాస్ చందు.ఈ కేసులో బండి సంజయ్ కి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios