టిఆర్ఎస్ నేతలు స్వరం పెంచుతున్నారు. ఏకంగా అధినేత కేసిఆర్ వైఖరినే ఎండగట్టేలా వారు విమర్శలకు దిగుతున్నారు. నిన్న హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి సొంత పార్టీ నేతలపైనే తిట్ల పురాణం అందుకుంటే ఇవాళ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కోరస్ పాడారు. టిఆర్ఎస్ లో ఏం జరుగుతోందన్న అనమానాలు రాజకీయ వర్గాల్లో కలుగుతున్నాయి. మరి హోంమంత్రి నాయిని, శ్రీనివాస్ గౌడ్ ఎందుకు స్వరం పెంచారో కింద చదవండి.

కేసిఆర్ ను తిట్టిన ముండాకొడుకులే... ఇవాళ తెలంగాణ కేబినెట్ లో కులుకుతున్నారు అని గురువారం హైదరాబాద్ లో హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కేసిఆర్ ను గతంలో బండ బూతులు తిట్టిన ముండాకొడుకులంతా నేడు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఉన్నారని ఆరోపించారు. కేసిఆర్ ను తిట్టినోళ్లు, తెలంగాణను వ్యతిరేకించినోళ్లే నేడు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారని సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ గడ్డ మీద పుట్టిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేయలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో మగాడంటే మర్రి చెన్నారెడ్డే అని కొనియాడారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో 1969 ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సభలో హోంమంత్రి నాయిని పాల్గొని మాట్లాడారు.

ఇక నాయిని మాటలకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్ గౌడ్ కోరస్ పాడారు. నాయిని నర్సింహ్మారెడ్డి మాట్లాడిన మాటలు వందకు వంద శాతం నిజమే అన్నారు. ఉద్యోగులు లేనిదే నాడు సకల జనుల సమ్మె విజయవంతం కాలేదని చెప్పారు. ఉద్యమంతో సంబంధం లేని వారు మంత్రి వర్గంలో ఉన్నమాట వాస్తవమే అన్నారు. సీమాంధ్ర శక్తులతో కుమ్మక్కై తెలంగాణ సర్కారును కూలదోయాలనుకున్నవాళ్లు కూడా నేడు కేబినెట్ లో ఉన్నారని విమర్శించారు. అయినా.. నాడు తెలంగాణ కోసం పనిచేయకుండా.. వ్యతిరేకంగా పని చేసిన వారే నేడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

మొత్తానికి ఇటు నాయిని నర్సింహ్మారెడ్డి కడుపులో ఉన్న ఆగ్రహాన్నంతా వెల్లగక్కడం.. వెనువెంటనే ఆయన మాటలను సమర్థిస్తూ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. వీళ్లిద్దరూ ఉద్దేశపూర్వకంగా మాట్లాడారా? లేక యదాలాపంగా మాట్లాడారా అన్న కోణంలో టిఆర్ఎస్ చూస్తోంది. స్వయంగా ఒక కేబినెట్ మంత్రే.. తన సహచరులపై విమర్శలు చేయడం హాట్ టాపిక్ అయింది.

ప్రస్తుతానికి కేబినెట్ లో, ఎమ్మెల్యేలుగా, ఎంపిలుగా, ఎమ్మెల్సీలుగా కేసిఆర్ ను తిట్టి... నేడు టిఆర్ఎస్ లో ఎవరెవరున్నారన్నదానిపై టిఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే అలాంటి వాళ్లందరినీ బిటి బ్యాచ్ అనే పేరుతో పిలుస్తున్నారు. బంగారు తెలంగాణ కోసం వచ్చిన వారందరినీ బిటి బ్యాచ్ అని.. ఉద్యమం చేసి టిఆర్ఎస్ పుట్టుకతో ఉన్న వారందరినీ యుటి బ్యాచ్ అని అంటున్న విషయం తెలిసిందే కదా.