భద్రాద్రి ఆలయం సీతారాముల క‌ల్యాణోత్స‌వానికి సిద్ధ‌మవుతోంది. సీతారాముల కల్యాణ మమోత్సవానికి ఆలయ వైదిక కమిటీ ముహూర్తాన్ని ఖరారు చేసింది. ఈసారి భక్తుల సమక్షంలోనే ఈ వేడుకను నిర్వహించనున్నారు.  

భద్రాద్రి ఆలయం సీతారాముల క‌ల్యాణోత్స‌వానికి సిద్ధ‌మవుతోంది. సీతారాముల కల్యాణ మమోత్సవానికి ఆలయ వైదిక కమిటీ ముహూర్తాన్ని ఖరారు చేసింది. శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో (Seetha Ramachandraswamy Temple) ఏప్రిల్‌ 2 నుంచి 16 వరకు వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఏప్రిల్ 10 న, మహా పట్టాభిషేకం వేడుకను 11వ తేదీన నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 10న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు శ్రీసీతారాముల తిరుకల్యాణోత్సవం (Sri Rama Navami) నిర్వహించనున్నారు. 

ఏప్రిల్ 6న ఉత్సవమూర్తులకు విశేష స్నపనం, ఉత్సవ అంకురార్పణ, 7న గరుడాధివాసం, 8న అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, 9న ఎదుర్కోలు ఉత్సవం, గరుడ వాహన సేవలను నిర్వహించనున్నారు. ఇక, ఏప్రిల్ 12న సదస్యం, 13న చోరోత్సవం, 14న ఊంజల్ సేవ, 15న వసంతోత్సవం, 16న చక్రతీర్థంతో ఉత్సవాలను పరిసమాపస్తి చేస్తారు. 

అయితే కరోనా కారణంగా గత రెండేళ్లుగా సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఆలయ ప్రాంగణంలోనే నిర్వహిస్తున్నారు. అయితే ఈ సారి కరోనా ప్రభావం తగ్గడంతో.. సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని భక్తుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్టుగా ఆలయ అధికారులు తెలిపారు. కరోనాకు ముందు మాదిరిగానే మిథిలా స్టేడియంలో భక్తుల సమక్షంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించాలని ఆలయ వైదిక కమిటీ నిర్ణయం తీసుకుంది.

ఎప్పటిలాగే తిరువీధి సేవలు, స్వామివారి ఊరేగింపులు ఉంటాయని చెప్పారు. ఇందుకు సంబంధించి ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి సీతారాముల కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను తీసుకొచ్చే సంప్రదాయం ఉండటంతో ఆలయ అధికారులు ఆహ్వానాలు సిద్దం చేస్తున్నారు.