తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ని కేసీఆర్ కుటుంబం గత కొంతకాలంగా దూరం పెడుతోందనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇవన్నీ అసత్యం అని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నప్పటికీ.. ఈ వార్తలకు పులిస్టాప్ పడటం లేదు. కాగా.. తాజాగా మరో వార్త నెట్టింట ప్రత్యక్షమైంది.

హరీష్ రావు కాంగ్రెస్ లో  చేరబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. టీఆర్ఎస్ పార్టీలో తనకు మద్దతు ఇచ్చే దాదాపు 40మంది ఎమ్మెల్యేలతో కలిసి హరీష్.. కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. కాగా.. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ జనగామ టీఆర్ఎస్ నాయకులు డీసీపీకి ఫిర్యాదు చేశారు.

కొన్ని రోజులుగా ప్రశాంత్ మణి అనే వ్యక్తి తన ఫేస్ బుక్ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు 40మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డీసీపీని టీఆర్ఎస్ నాయకులు కోరారు.