హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బుధవారంనాడు ప్రతిపక్షాల నేతలకు ఫోన్ చేశారు. స్పీకర్ పదవిని ఏకగ్రీవం చేయడానికి సహకరించాలని ఆయన వారిని కోరారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి, మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి, బిజెపి అధ్యక్షుడు కె. లక్ష్మణ్ కు ఆయన ఫోన్ చేసి మాట్లాడారు.

స్పీకర్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు సహకరించేందుకు అసదుద్దీన్ ఓవైసీ, డాక్టర్ కె. లక్ష్మణ్ అంగీకరించారు. అయితే, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. పార్టీలో చర్చించి రేపు నిర్ణయం ప్రకటిస్తామని ఆయన చెప్పారు. 

కాగా, సిఎల్పీ నేతను ఎన్నుకునేందుకు బుధవారం రాత్రి కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ కుంతియా పాల్గొన్నారు.  ఎఐసిసి కార్యదర్శి బోసురాజు కూడా పాల్గొన్నారు.

స్పీకర్ ఎన్నిక ఈ నెల 18వ తేదీన జరుగుతుంది. రేపు తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. స్పీకర్ పదవికి సీనియర్ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస రెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.