తెలంగాణకు వాతావరణ శాఖ చల్లనికబురు అందించింది. ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోకి రుతుపవనాల రాకపై గుడ్ న్యూస్ చెప్పింది.
హైదరాబాద్: తెలంగాణకు వాతావరణ శాఖ చల్లనికబురు చెప్పింది. ఈసారి రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల ఎంట్రీ ఆలస్యమైన సంగతి తెలిసిందే. జూన్ 20వ తేదీ వచ్చిన రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఓవైపు ఎండ తీవ్రత, మరోవైపు ఉక్కపోతతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాతావరణ శాఖ రుతుపవనాల రాకపై గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 22 నాటికి నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించనున్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే అరేబియా సముద్రం మీదుగా పశ్చిమ తీరాన్ని అతలాకుతలం చేసిన బిపర్‌జోయ్ తుపాన్ కారణంగా నైరుతి రుతుపవనాల విస్తరణ కాస్త ఆలస్యం అయినట్టుగా చెబుతున్నారు.
ఈ నెల 11వ తేదీన ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు అక్కడే స్తంభించాయి. రాయలసీమ నుంచి నైరుతి రుతుపవనాలు ముందుకు కదల్లేదు. శ్రీహరికోట, కర్ణాటకలోని రత్నగిరి ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు నిలిచిపోయాయి. తాజాగా రుతుపవనాల విస్తరణలో కదలిక వచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే నైరుతి రుతుపవనాలు ఈ నెల 22లోపు తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. 21వ తేదీన లేదా 22వ తేదీన తెలంగాణను రుతుపవనాలు తాకనున్నాయి.
నైరుతి రుతుపవనాలు తెలంగా మొత్తం విస్తరించటానికి మూడు నుంచి నాలుగు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే, రాష్ట్రంలో నేడు, రేపు రాష్ట్రంలోని కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రుతుపవనాల విస్తరణ తర్వాత తెలంగాణలో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఇదిలా ఉంటే.. రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో తెలంగాణ ఎండల తీవ్రత కొనసాగుతూనే ఉంది. పలు జిల్లాల్లో వడగాల్పులు వీస్తున్నాయి. దీంతో మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటే జనం భయపడిపోతున్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో 44.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
