కన్న తల్లి అనే కనికరం కూడా లేదు. కనీసం.. ఆమె వయసు మీద కూడా గౌరవం లేదు. వయసు మీద పడిన తల్లిని కంటిపాపలా చూసుకోవాల్సింది పోయి.. భారంగా భావించారు. చంపేస్తామని బెదిరించి డబ్బు, నగలు గుంజుకున్నారు. ఈ దారుణ సంఘటన తెలంగాణలో చోటుచేసుకోగా,.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఓ వృద్ధురాలు తలదాచుకోని ఉంది. కాగా.. అక్కడికి వచ్చిన వంగపల్లిలోని అమ్మ ఒడి అనాథాశ్రమ నిర్వాహకులు గురువారం ఆమెతో మాట్లాడగా.. తన బాధనంతా చెప్పుకొని బోరుమని విలపించింది. 

చౌటుప్పల్‌ మండలం స్వాములవారి లింగోటం గ్రామానికి చెందిన  జెల్ల సంపూర్ణ దీన గాథ ఇది. భర్త కిష్టయ్య చనిపోయాక.. ఆయన పేరిట ఉన్న పొలంపై వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తోంది. కుమారులు శ్రీనివాస్‌, జ్ఞానేశ్వర్‌లు ఆమె బంగారం, డబ్బు, ఆస్తిపత్రాలు తీసుకొని చిత్రహింసలకు గురిచేశారు. గ్రామ పెద్దలకు చెప్పినా స్పందన రాకపోవడంతో సంపూర్ణ మూడు రోజులుగా దేవస్థానం సమీపంలో ఉంటోంది. సంపూర్ణకు ఆశ్రమ నిర్వాహకులు ఆశ్రయం ఇచ్చారు.

కాగా.. తనను చంపుతామని బెదిరిస్తున్న తన కుమారులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. వారిపై చౌటుప్పల్‌ ఆర్డీవో కార్యాలయంలో ఫిర్యాదు చేసినా లాభం లేకపోయిందని వాపోయారు. తాను తన  కొడుకుల వద్దకు వెళ్లనని చెప్పారు. తన డబ్బు, బంగారం, ఆస్తి పత్రాలు ఇప్పిస్తే.. తన బతుకు తాను బతుకుతానని చెప్పారు. తనకు  న్యాయం చేయాలని ఆమె అధికారులకు విజ్ఞప్తి చేశారు.