తల్లి తనకు పెళ్లి చేయడం లేదని ఓ కొడుకు దారుణానికి తెగించాడు. ఆమెను హత్య చేసి దొంగలమీదికి నెట్టాలని చూశాడు. 

ములుగు : తెలంగాణలోని ములుగు జిల్లాలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. తల్లి తనకు పెళ్లి చేయడం లేదని ఓ కొడుకు దారుణానికి తెగబడ్డాడు. కన్నతల్లిని గొంతు కోసి హత్య చేసి, ఆ తర్వాత కాళ్లు నరికేశాడు. తల్లి కాళ్లకు ఉన్న కడియాల కోసమే దొంగలు హత్య చేశారని నమ్మించాలని చూశాడు. ఓ బంధువుతో కలిసి ఈ హత్య చేశాడు. గురువారం నాడు సిద్దిపేట జిల్లాలో కలకలం రేపిన మహిళ హత్య కేసులో వెలుగు చూసిన వాస్తవాలు ఇవి.

దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే.. సిద్దిపేట జిల్లా ములుగు మండలంబండమైలారంలో ఉండే మిరియాల వెంకటమ్మ (45) భర్త 15 ఏళ్ల క్రితం చనిపోయాడు. అప్పటినుంచి పాత ఇనుప సామాగ్రి క్రయవిక్రయాలతో కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఆమెకు ఇద్దరు సంతానం. కూతురు శైలజ వివాహమయ్యింది. కొడుకు ఈశ్వర్ ఆమెతో పాటే ఉంటున్నాడు.

సిద్దిపేటలో మహిళ దారుణ హత్య.. గొంతు కోసి, కాళ్లు నరికి పైశాచికం..

గతంలో జరిగిన కరెంటు యాక్సిడెంట్లో ఈశ్వర్ చేతికి గాయాలయ్యాయి. దీంతో అతని చేయి తొలగించారు. చేయిలేకపోవడంతో అతడికి పెళ్లి కావడం లేదు. పెళ్లి విషయంలోనే తల్లి కొడుకుల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. దీంతో ఈశ్వర్ మద్యానికి బానిసయ్యాడు.తల్లి మీద తీవ్రమైన కోపంతో ఆమెను హత్య చేస్తే కానీ తన పెళ్లి జరగదని నిర్ణయానికి వచ్చాడు.

ఈ క్రమంలోనే తన దూరపు బంధువైన పర్వతం రాము సహాయం కోరాడు. అయితే ఆమెను హత్య చేసిన తర్వాత తమ మీదికి రాకుండా ఉండాలని పథకం వేశారు. దీంట్లో భాగంగానే రాము సహాయం తీసుకుని.. పదునైన ఆయుధంతో తల్లి వెంకటమ్మను గొంతు కోసి నరికారు. ఆ తర్వాత హత్య చేసిన విషయం తమ మీదికి రాకుండా ఉండాలని ఆమె రెండు కాళ్లు నరికేశారు. కాళ్లకు ఉన్న కడియాలను తీసి దాచి పెట్టారు.

ఆ తర్వాత గుర్తు తెలియని దుండగులు కడియాల కోసమే తల్లిని చంపి కడియాలు ఎత్తుకెళ్లారని సోదరిని, బంధువులను, మిగతా వారిని నమ్మించాలని ప్రయత్నించారు. తల్లి మృతి చెందిన విషయం తెలిసి వచ్చిన సోదరి శైలజ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. అక్కడ ఘటన జరిగిన తీరు… ఈశ్వర్ ప్రవర్తనలో తేడా కనిపించడంతో అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది.