నవమోసాలు మోసి, కనీ పెంచిన కొడుకే ఆ తల్లి పాలిట కాలయుడయ్యాడు. మానవత్వాన్ని, రక్త సంబంధాన్ని మరిచి తాగిన మైకంలో తల్లిని రాడ్ తో కొట్టి గాయపర్చాడో కసాయి తనయుడు. ఆ తల్లి గుండెలపై వేసుకుని లాలించగా పెరిగిన అతడు అదే గుండెమీద కూర్చుని గొంతు నులిమి ఊపిరి అందకుండాచేసి చంపాడు.  ఈ హత్య హైదరాబాద్ లో సంచలనం రేపింది.

ఈ హత్యకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఎస్సార్ నగర్ సమీపంలోని ఎల్లారెడ్డిగూడలోని వీకేఆర్‌ అపార్ట్‌మెంట్‌లో గొంటి చౌదరి శ్రీనివాస్‌ యాదవ్‌, మమత దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి సంతానం. అయితే వీరి కొడుకు మదన్ శ్రీకర్ ఏ పనీ చేయకుండా జులాయిగా తిరుగుతుండేవాడు.  

అయితే మమత కాలనీలోని వారిని సభ్యులుగా చేర్చుకుని రెండేళ్ల క్రితం చిట్టీల వ్యాపారం మొదలుపెట్టింది. అయితే ఆ చిట్టీల వ్యాపారం ప్రస్తుతం నష్టాల్లో పడింది.చిట్టీలు పాడుకున్న వారికి కూడా డబ్బులివ్వలేని పరిస్థితిలోకి వెళ్లి పోయింది. దీంతో ఈమె వద్ద చిట్టీలు వేసిన కాలనీవాసులు తరచూ వీరి ఇంటికి వచ్చయి గొడవకు దిగేవారు.

దీంతో ఈ అవమానాన్ని తట్టుకోలేక మమత కొన్ని రోజుల కింద ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే కుటుంబ సభ్యులు సకాలంలో ఆమెను ఆస్పత్రిలో చేర్చడంతో ప్రాణాలతో బైటపడింది. అప్పటినుండి మమత తన అన్న వాళ్ల ఇంట్లోనే ఉంది.

ఆరోగ్యం మెరుగుపడటంతో నిన్న మమత సోదరుడి ఇంటినుండి సొంతింటికి వచ్చింది. అయితే అదే సమయంలో ఫుల్లుగా మద్యం సేవించి వచ్చిన శ్రీకర్ మాట్లాడాలని చెప్పి తల్లిని టెర్రస్ పైకి తీసుకెళ్లాడు. అక్కడ కుటుంబ పరువు తీస్తున్నావంటూ ఆవేశంతో రాడ్ తో దాడి చేశాడు. గాయపడి కిందపడిపోయిన తల్లి గొంతు నులిమి ప్రాణాలు తీశాడు.

అనంతరం తండ్రికి, బంధువులకు ఫోన్ చేసి తాను తల్లిని హతయ చేసినట్లు తెలిపాడు. ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అయితే తన సోదరి హత్యకు బావ కూడా కారణమని మమత సోదరుడు ఆరోపిస్తున్నాడు. అతడి ప్రోత్సాహం, సహకారంతోనే శ్రీకర్ ఈ హత్య చేసినట్లు అతడు పోలీసులకు తెలిపాడు. దీంతో ఈ హత్యకు ప్రోత్సహించిన  శ్రీనివాస్‌యాదవ్‌ తో పాటు హత్య చేసిన శ్రీకర్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.