అనారోగ్యంతో మంచానపడ్డ తండ్రికి సేవలు చేయలేక ఓ కసాయి అతి దారుణంగా కొట్టిచంపాడు. ఈ అమానవీయ ఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది. 

హైదరాబాద్ : చాలామంది దంపతులు తమకు కొడుకే పుట్టాలని కోరుకుంటూ వుంటారు. అలాగే చాలామంది తల్లిదండ్రులు ఏ విషయంలో చూసుకున్నా కూతుళ్ల కంటే కొడుకులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. తమను పున్నామ నరకంనుండి కాపాడేవాడు కొడుకేనని భావిస్తుంటారు. కానీ కొందరు కసాయి కొడుకులు తల్లిదండ్రులను పున్నామనరకం నుండి కాపాడటం మాట అటుంచి బ్రతికుండగానే నరకం చూపిస్తున్నారు. ఇలాంటి దారుణమే హైదరాబాద్ లో వెలుగుచూసింది. దుర్మార్గుడైన కొడుకు అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన తండ్రిని అతి దారుణంగా కొట్టిచంపాడు.

వివరాల్లోకి వెళితే... తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ కుత్భుల్లాపూర్ లో సత్యనారాయణ (63) కుటుంబంతో కలిసి జీవించేవాడు. ఎంతో కష్టపడి కొడుకు సురేష్ (43) ను పెంచి పెద్దచేసి పెళ్లి చేసాడు. అయితే ఐదేళ్ల క్రితం సత్యనారాయణ పక్షవాతం బారినపడి మంచానికే పరిమితమయ్యాడు. అప్పటినుండి అతడికి కొడుకు కుటుంబం సేవలు చేయాల్సివస్తోంది. 

ఇరవై ముప్పైఏళ్ళు తల్లిదండ్రులు తనకు చేసిన సేవలను ఆ కసాయి కొడుకు మరిచిపోయాడు. ఐదేళ్ళపాటు తండ్రికి సేవచేసి విసిగిపోయినట్లున్నాడు. దీంతో తండ్రి అన్న ప్రేమ లేకపోగా వృద్దుడన్న జాలి కూడా చూపలేదు. కన్నతండ్రిని అతి దారుణంగా కొట్టిచంపాడు ఈ కసాయి కొడుకు. 

గతరాత్రి ఫుల్లుగా మద్యంసేవించి ఇంటికివచ్చిన సురేష్ కన్నతండ్రిని చూసి కోపంతో ఊగిపోయాడు. అకారణంగా మంచంపై వున్న తండ్రిని బెల్ట్, కర్రతో కొట్టాడు. ఇలా మద్యంమత్తులో విచక్షణారహితంగా చితకబాదడంతో తీవ్రంగా గాయపడ్డ సత్యనారాయణ అక్కడికక్కడే మృతిచెందాడు. 

ఈ అమానవీయ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సత్యనారాయణ మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనాస్థలంలో ఆధారాలను సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని తండ్రిని చంపిన కసాయి కొడుకు సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు.