హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీరు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. శనివారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో జీవీకె మాల్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. శివనాగరాజు అనే టెక్కీని దుండగులు గొంతు కోసి చంపేశారు. ఆ తర్వాత భవనంపై నుంచి కిందికి తోసేశారు. 

జాడో ఎడ్యుకేషన్ కంపెనీలో పనిచేస్తున్న శివ నాగరాజు బంజారాహిల్స్‌లో ఐదు అంతస్థు మీద నుంచి కిందపడ్డాడు. దాంతో మొదట దీన్ని ఆత్మహత్యగా పోలీసులు ఆత్మహత్యగా భావించారు. అయితే అతని ఒంటిపై కత్తిగాట్లను పరిశీలించిన తర్వాత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

శివ నాగరాజు శనివారం తెల్లవారు జామున 3 గంటలకు బిల్డింగ్‌పై నుంచి కింద పడిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. శివనాగరాజు ఒంటి మీద కత్తి ఘాట్లు ఉన్నాయని, పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత వివరాలు తెలుస్తాయని వెస్ట్ జోన్ డీసీపీ ఎఆర్ శ్రీనివాస్ అన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

ఆదివారం రాత్రి 8 గంటల నుంచి ఆఫీస్ లోపల సీసీ కెమెరాలను ఆపేశారని, సీసీ కెమెరాలను ఎవరు ఆపేశారనేది తెలియాల్సి ఉందని ఆయన అన్నారు. ఆఫీస్ మేనేజర్‌తో పాటు సిబ్బందిని విచారిస్తున్నామని అన్నారు.