జగిత్యాల: ఈ కంప్యూటర్ యుగంలో ప్రపంచమంతా ఆధునిక పోకడలకు అలవాడు పడి అభివృద్దితో దూసుకుపోతుంటే కొందరు మాత్రం ఇంకా పాతకాలంనాటి మూఢనమ్మకాలతో దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇలా చేతబడి నెపంతో ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ ను కుటుంబసభ్యులే అతి దారుణంగా హతమార్చిన దారుణం జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. 

హైదరాబాద్ ఆల్వాల్ లో రాచర్ల పవన్ కుమార్(38) భార్యతో కలిసి నివాసముండేవాడు. ఇటీవల జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో నివసించే ఇతడి సమీపబంధువు(వరసకు బామ్మరిది) జగన్ అనారోగ్యంతో మృతిచెందాడు. అయితే అంత్యక్రియలకు రాలేకపోయిన పవన్ భార్య కృష్ణవేణితో కలిసి పరామర్శించడానికి వెళ్లాడు. ఇలా దు:ఖంలో వున్న బంధువులను ఓదార్చాలనుకోవడమే అతడి ప్రాణాలమీదకు తెచ్చింది. 

 సోమవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో భార్యాభర్తలు బాధిత కుటుంభీకుల ఇంటికి వెళ్లారు. కానీ అప్పటికే పవన్ చేతబడి చేయడం వల్లే తన భర్త చనిపోయాడన్న అనుమానాన్ని పెంచుకున్న మృతుడు జగన్ భార్య పవన్ పై దాడికి దిగింది. అంతేకాకుండా కుటుంబసభ్యులంతా కలిసి పవన్ ను ఓ గదిలో బంధించి పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో అతడు సజీవ దహనమయ్యాడు. 

భార్య కృష్ణవేణి కళ్లేదుటే పవన్ సజీవదహనం అయ్యాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వచ్చి గది తాళం తీసే సరికే పవన్‌కుమార్‌ పూర్తిగా దహనమయ్యాడు. ఈ అమానుష ఘటనపై కేసు నమోదు చేసుకుని ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు  పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని... పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు వెల్లడించారు.