అదనపు కట్నం వేధింపులకు ఓ టెకీ బలయ్యింది. భర్తకు అత్తామామలు, మరిదితోడై జరిపే అరాచకాలకు తట్టుకోలేక మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.  

హైదరాబాద్ : వివాహమై పది నెలలు. dowry harassment ఎక్కువై తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకుందో software employee. వేధింపులు భరించలేక పుట్టింటికి వచ్చినా భర్త ఆగడాలు ఆగకకపోవడమే కారణమని తెలుస్తోంది. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పట్టణానికి చెందిన జూపల్లి శ్రీనివాసరావు కొన్ని నెలల క్రితం తన కుటుంబంతో నగరానికి వలస వచ్చాడు. కూకట్పల్లి బాలకృష్ణ నగర్ లోని ప్లాట్ నెంబర్ 158లో ఉంటున్నారు. ప్రైవేటు ఉద్యోగి అయిన ఆయనకు ఇద్దరు కుమార్తెలు. సాఫ్ట్వేర్ ఉద్యోగిని అయిన పెద్ద కుమార్తె నిఖిత (26)కు సిరిసిల్ల పట్టణానికే చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి చేటి ఉదయ్ తో గతేడాది జూన్ 6 న వివాహం జరిపించారు.

వివాహ సమయం రూ.10 లక్షల నగదు, 35 తులాల బంగారు ఆభరణాలను ఇచ్చారు. శ్రీనివాసరావుకు సొంతూరులో 4.25 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా అందులో సగం భూమిని తన పేరిటగానీ, తన తల్లిదండ్రుల పేరుతో గానీ రాయించాలని నిఖిత భర్త వేధిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు శ్రీనివాసరావు సమ్మతించకపోగా తన మరణానంతరం ఆస్తి చెందుతుందని తెగేసి చెప్పాడు. దీంతో ఉదయ్ తనకు అదనపు కట్నం కావాలంటూ భార్యను నిత్యం వేధించేవాడు. దీంతో శ్రీనివాసరావు ఇటీవల అల్లుడికి మరో పది లక్షలు ఇచ్చాడు. అయినా ఉదయ్ ది అదే తీరు. అత్తమామలు అశోక్ రావు, శ్యామల, మరిది ఉపేందర్ సైతం ఉదయ్ కి వంత పాడుతుండడంతో నిఖిత ఉగాది రోజైన (ఏప్రిల్ 2న) కూకట్పల్లిలోని పుట్టింటికి వచ్చింది. అయినా రోజు ఫోన్లో భార్యను వేధించేవాడు.

ఒకవేళ ఫోన్ తీయకపోతే ఆమె సోదరి నీతకు ఫోన్ చేసి దూషించేవాడు. ఈ నెల 20న అత్తగారి ఇంటికి వచ్చి గొడవ పడ్డాడు. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో భార్యాభర్తలకు తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఆ సమయంలో భార్య మెడలోని మంగళసూత్రాలు తెంపి ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో మనస్థాపం చెందిన నిఖిత బెడ్ రూంలోకి వెళ్లి తలుపు వేసుకుంది. రాత్రి పది గంటలు దాటినా తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబీకులు తలుపు బద్దలుకొట్టి చూడగా ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయింది. 

మృతదేహంతో ఆందోళన..
వివాహిత ఆత్మహత్య కారణమైన భర్తపై చర్యలు తీసుకోవాలంటూ నిఖిత బంధువులు గురువారం సిరిసిల్లలోని మృతురాలి భర్త ఉదయ్ ఇంటి ముందు ఆందోళన చేశారు. హైదరాబాదులో మృతిచెందిన ఆమెకు అత్తగారి ఇంటి వద్దనే అంత్యక్రియలు నిర్వహించాలని తీసుకురాగా... జిల్లా సరిహద్దు గ్రామమైన జిల్లెల్లలో పోలీసులు అడ్డుకుని మృతదేహాన్ని తంగళ్ళపల్లి మండలం కస్బెకట్కూరుకు తరలించాలని కుటుంబ సభ్యులకు సూచించారు. దీంతో మృతదేహాన్ని కస్బెకట్కూరు కు తరలించడంతో ఆగ్రహించిన గ్రామస్తులు సిరిసిల్ల పురపాలక సంఘం పరిధిలో వెంకంపేటలోని ఉదయ్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. మృతురాలికి అంత్యక్రియలు అత్తారింట్లో చేస్తారా? మమ్మల్ని చేయమంటారా అని అడగడానికి వస్తే పోలీసులను పెట్టి అడ్డుకోవడమేమిటని బంధువులు ప్రశ్నించారు. మృతురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.