భార్య బెడ్రూంలో ఉండగానే... ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఎస్ఆర్ నగర్ పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గుంటూరు జిల్లాకు చెందిన పూర్ణచందర్‌రెడ్డి (34)కి నాలుగు సంవత్సరాల క్రితం స్వర్ణతో వివాహం జరిగింది. విద్యావంతులైన భార్యాభర్తలు వెంగళరావునగర్‌లో నివాసం ఉంటూ వేర్వేరు కంపెనీల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఇటీవల ఇంటి నిర్మాణం కోసం బ్యాంక్‌ రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు.

బ్యాంకు అధికారులు రుణం రాదని చెప్పారు. దీంతో గత కొంత కాలంగా ముభావంగా ఉంటున్న పూర్ణచందర్‌రెడ్డి మంగళవారం భార్య బెడ్‌రూంలో ఉండగా గుర్తు తెలియని విషం తాగి హాల్లో పడిపోయాడు. కొద్ది సేపటి తర్వాత భార్య స్వర్ణ బయటికి వచ్చి చూడగా భర్త అపస్మారక స్థితిలో ఉన్నాడు. స్థానికుల సహకారంతో పంజాగుట్టలోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో పూర్ణచందర్‌రెడ్డి అర్ధరాత్రి మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.