కరోనా లాక్ డౌన్ కి ముందు అతని జీవితం ప్రశాంతంగానే సాగింది. అనుకోకుండా  వచ్చిన లాక్ డౌన్ కారణంగా  ఉన్న ఉద్యోగం పోయింది. కుటుంబాన్ని పోషించడం భారమైంది. దీంతో..  ఆన్ లైన్ యాప్ ల నుంచి రుణం తీసుకున్నాడు. కాగా.. తిరిగి మాత్రం చెల్లించలేకపోయాడు. దీంతో వారి వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సునీల్(29) హైదరాబాద్ నగరంలోని ఓ సాప్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. భార్య, ఆరు నెలల కూతురు తో కలిసి రంగారెడ్డి జిల్లా కిస్మత్ పూర్ లో నివసిస్తున్నాడు.

అయితే.. అనుకోకుండా కరోనా లాక్ డౌన్ సమయంలో అతని ఉద్యోగం పోయింది. దీంతో ఆర్థిక ఇబ్బందులకు గురైన అతను పలు ఆన్ లైన్ యాప్ ల త్వారా మొత్తం రూ.50వేలు అప్పు చేశాడు. 30 శాతం వడ్డీతో డబ్బులు చెల్లించాలని యాప్‌ల నిర్వాహకులు ఇటీవల అతడిపై తీవ్ర ఒత్తిడి చేశారు. వీటితో పాటు సునీల్‌కు వ్యక్తిగతంగా మరో రూ.6 లక్షల అప్పు ఉంది. మూడు నెలల క్రితం స్వగ్రామంలో ఉన్న భూమిని విక్రయించి తల్లిదండ్రులు ఆ అప్పు చెల్లించారు. 

అనంతరం తండ్రి వెంకటరమణ సునీల్‌కి మరో రూ.లక్ష కూడా ఇచ్చాడు. అయితే, ఆన్‌లైన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు తీవ్రమవడంతో పది రోజులక్రితం సునీల్‌ సైబర్‌ క్రైంకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఫిర్యాదు చేశాడు. పోలీసులు స్వయంగా ఠాణాకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించగా సునీల్‌ వెళ్లలేదు. 

ఇదిలా ఉండగా, అతడికి మూడు రోజులక్రితం బంజారాహిల్స్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో రూ.7 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. బుధవారం మధ్యాహ్నం కంపెనీ నిర్వాహకులు కాల్‌ చేయగా, ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను.. ఉద్యోగం మరొకరికి ఇవ్వండి’అని చెప్పి కాల్‌ కట్‌ చేసి ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేశాడు. 

ఇచ్చిన అప్పు తిరిగి వసూలు చేసేందుకు సదరు ఆన్ లైన్ సంస్థలు  సునీల్ ని విపరీతంగా వేధించినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.