మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లో మంత్రి హరీష్ రావు పాల్గొనాల్సిన సభాస్థలం వద్ద పాము కలకలం సృష్టించింది. డోర్నకల్ టీఆర్ ఎస్ అభ్యర్థికి మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభకు హరీష్ విచ్చేశారు. అయితే ఆయన రాకకు ముందు సభాస్థలం వద్ద గుమిగూడిన జనాల మధ్యలో  పాము కలకలం సృష్టించింది. దీంతో కాస్సేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అయితే పాము వల్ల ఎవరికీ ఎలాంటి హాని జరక్కపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

డోర్నకల్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పోటీచేస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఇవాళ డోర్నకల్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. అయితే హరీష్ రాకకు ముందు సభాస్థలి వద్ద ఓ పాము కలకలం సృష్టించింది. 

ఇక ఈ సభలో హరీష్ ప్రసంగిస్తూ... మహాకూటమికి ఓట్లేస్తే శనీశ్వరునికి ఏట్లేసినట్లేనని ఎద్దేవా చేశారు. మీకు శనీశ్వరుడు కావాలో... కాళేశ్వరం ప్రాజెక్టు కావాలో నిర్ణయించుకొండని ప్రజలకు సూచించారు. గతంలో మనం అనుభవించిన ఈ శనేశ్వర పాలన ఇక చాలని...మరోసారి వారికి అధికారం అప్పజెపితే మనకు ఇప్పుడు అందుతున్న పథకాలేవి ఉండవని హరీష్ తెలిపారు.

కాంగ్రెస్ నాయకుల్లా తాము గెలిస్తే ఏసి గదుల్లో వుండమని..ప్రజల్లో ఉంటూ పనిచేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే డోర్నకల్ కు సమృద్దిగా సాగునీరు అందుతాయని హామీ ఇచ్చారు. తమకు మళ్లీ అధికారం అందిస్తే కాళేశ్వరంను పూర్తిచేసి డోర్నకల్ కు నీళ్లు తెస్తానని...అలా తీసుకురాకపోతే మళ్లీ ఓట్లు అడగనని హరీష్ అన్నారు.