పొగ త్రాగడం ప్రాణాలకు ప్రమాదం.. అదే జరిగింది ఓ వ్యక్తి విషయంలో.  మెల్లగా ప్రాణాలు తీసే ధూమపానం అతన్ని సజీవ దహనం చేసింది. రోజూ తను కాల్చే చుట్టే.. ఆ రోజు అతణ్ని కాల్చేసి బూడిద చేసింది. 

మంచంపై పడుకుని చుట్ట తాగుతూ నిద్రలోకి జారుకోగా.. ఆ చుట్ట అతడి నోట్లో నుంచి జారి మంచం కింద ఉన్న గడ్డికి అంటుకోవడంతో సజీవదహనం అయిపోయాడో వ్యక్తి. 

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లికి చెందిన పెంకు వెంకన్న (70) గంగిరెద్దులు ఆడిస్తూ జీవిస్తుంటాడు. శుక్రవారం మధ్యాహ్నం వెంకన్న.. తన గుడిసె వద్ద మంచం వేసుకుని చుట్టతాగుతూ నిద్రలోకి జారుకున్నాడు. 

ఆ సమయంలో అతడి చేతిలోని చుట్ట.. మంచం కింద ఉన్న గడ్డిపై పడింది. గడ్డికి నిప్పంటుకోవడంతో.. మంటలు చెలరేగాయి. తప్పించుకునే అవకాశం కూడా లేకుండా వెంకన్నను మంటలు చుట్టుముట్టేశాయి. 

దీంతో.. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వెంకన్న సజీవ దహనమయ్యాడు. ఈ మేరకు వేంసూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.