యాదగిరిగుట్ట:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పునర్నిర్మాన పనులను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ పనుల్లో బుధవారం అపశ్రుతి చోటుచేసుకుంది.వైఐడిఎ అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మాణం ఈ రోజు కుప్పకూలింది. దీంతో అక్కడే పని చేస్తున్న నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. 

వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స నిర్వహించారు. అయితే కార్మికుల పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి పంపించారు. కాగా గాయపడిన వారిని శ్రీకాకుళం, మహబూబ్ నగర్ వాసులుగా గుర్తించారు.
 
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి పక్కనే ఉన్న మరో గుట్టపై దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో వీవీఐపీ భక్తుల కోసం 20 వరకూ ప్రెసిడెన్షియల్ సూట్ విల్లాల నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. 

ఈ పనుల్లో భాగంగా 6వ విల్లాలో జరుగుతున్న సమయంలో స్లాబ్ కూలింది. దీంతో అక్కడే పని చేస్తున్న నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. కాగా యాదాద్రి కీర్తిని ప్రపంచ స్థాయిలో నిలిపేందుకు.. ఈ ఆయలం కట్టడంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే