బాసర ట్రిపుల్ ఐటీలో కరోనా కలకలం: ఆరుగురికి కోవిడ్, ఐసోలేషన్ లో చికిత్స
బాసర ట్రిపుల్ ఐటీలో ఆరుగురు విద్యార్ధులకు కరోనా సోకింది. కరోనా సోకిన విద్యార్ధులను ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. విద్యార్ధులకు కరోనా సోకడంతో అధికారులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఇతరులకు కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేశారు.
నిర్మల్: Basara IIIT ట్రిపుల్ ఐటీలో Corona కలకలం సృష్టించింది. ఆరుగురు విద్యార్ధులకు కరోనా సోకింది. కరోనా సోకిన విద్యార్ధులకు చికిత్స అందిస్తున్నారు. కరోనా సోకిన విద్యార్ధులను కలిసిన వారు కూడా వైద్య పరీక్షలు చేయించుకోవాలని కూడ వైద్యులు సూచిస్తున్నారు. మూడు రోజుల క్రితం ఒక విద్యార్ధికి కరోనా లక్షణాలు కన్పించాయి. అతనికి పరీక్షలు నిర్వహిస్తే కరోనా సోకిందని తేలింది. అతనితో సన్నిహితంగా ఉన్నవారికి కూడా కరోనా సోకింది కరోనా సోకిన ఆరుగురిని కూడా Isolationలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
బాసర ట్రిపుల్ ఐటీలో మెస్ కాంట్రాక్టర్ ను మార్చాలని ఒక్క రోజు ఆందోళన నిర్వహించిన విద్యార్ధులు ఆదివారం నాడు అర్ధరాత్రి నుండి ఆందోళనను విరమించారు. ఈ ఏడాది జూలై 16న బాసర ట్రిపుల్ ఐటీలో పుడ్ పాయిజన్ అయింది. ఈ ఘటనలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ విద్యార్ధి మరణించాడు. ఇదే జిల్లాకు చెందిన మరో విద్యార్ధి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మెస్ కాంట్రాక్టర్ ను మార్చాలని విద్యార్ధులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ తో శనివారం నాడు రాత్రి నుండి ఆదివారం నాడు రాత్రి వరకు విద్యార్ధులు ఆందోళన చేశారు. ఆదివారం నాడు వర్శిటీ అధికారులతో విద్యార్ధులు జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి.
ఈ చర్చలు విజయవంతం కావడంతో ఆదివారం నాడు రాత్రి విద్యార్ధులు ఆందోళనను విరమించారు. సోమవారం నాడు ఉదయం నుండి విద్యార్ధులు క్లాసులకు హాజరయ్యారు. అయితే ఈ తరుణంలో విద్యార్ధులకు కరోనా సోకడం ప్రస్తుతం కలకలం రేపుతుంది.
ఈ ఏడాది జూన్ మాసంలో వారం రోజుల పాటు విద్యార్ధులు ఆందోళన నిర్వహించారు. తాము లేవనెత్తిన 12 డిమాండ్లను పరిష్కరించాలని విద్యార్ధులు వారం రోజులు ఆందోళన చేశారు. జూన్ 20వ తేదీన తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చర్చలతో విద్యార్ధులు తమ ఆందోళనను విరమించారు. అయితే సబితా ఇంద్రారెడ్డి చర్చలకు సంబంధించి ఇంకా సమస్యలు పరిష్కారం కాలేదని విద్యార్ధులు చెబుతున్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చి నెల రోజులు దాటినా కూడా ఇంకా పరిష్కారం కాకపోవడంపై విద్యార్ధులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నామని ఇంచార్జీ వీసీ వెంకటరమణ తెలిపారు.
also read:ఆందోళన విరమించిన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు: క్లాసులకు హాజరు
మరో వైపు విద్యార్ధులు ఆందోళనకు వారి పేరేంట్స్ కూడా ఆందోళనకు సిద్దమయ్యారు. ఆదివారం నాడు హైద్రాబాద్ లో సమావేశమైన విద్యార్ధుల పేరేంట్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ విషయమై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముందు ఆందోళన చేశారు. ఆందోళన చేసిన పేరేంట్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల సమస్యలు పరిష్కరించకుండా మీన మేసాలు లెక్కిస్తుందని పేరేంట్స్ కమిటీ ఆరోపించింది. ప్రభుత్వం ఇకనైనా బాసర టరిపుల్ ఐటీలో విద్యార్ధులకు సౌకర్యాలు కల్పించాలని పేరేంట్స్ కమిటీ డిమాండ్ చేసింది.