హైదరాబాద్‌: ఆరుగురు శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరడానికి సిద్ధపడినట్లు జరుగుతున్న ప్రచారంతో కాంగ్రెసులో కల్లోలం పుట్టింది. ఆ ఆరుగురు శాసనసభ్యులు కూడా మీడియాకు అందుబాటులోకి రావడం లేదు.

కొంత మంది శాసనసభ్యులు తమ సెల్ ఫోన్లను స్విచాఫ్ చేయగా, మరికొందరు లిఫ్ట్ చేయడం లేదు. దీంతో వారు టీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధపడ్డారనే ప్రచారానికి బలం చేకూరుతోందని అంటున్నారు. 

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఐరోపా పర్యటనను ముగించికుని తిరిగి వచ్చారు. ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దడానికి ఆయన రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. 

కాంగ్రెసులో ఉండడం వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదనే ఉద్దేశంతో వారు టీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను ఆకర్షించడదానికే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రివర్గ విస్తరణను వాయిదా వేస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. 

ఈ నెల 16వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈలోగనే కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నుంచి గెలిచినవారిలో సాధ్యమైనంత ఎక్కువ మందిని టీఆర్ఎస్ లో చేర్చుకోవడానికి కేసీఆర్ వ్యూహరచన చేసినట్లు చెబుతున్నారు. ఆ వ్యూహాన్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆయా జిల్లాలలో నేతలతో అమలు చేస్తున్నట్లు సమాచారం. 

సంబంధిత వార్త

కాంగ్రెసుకు భారీ షాక్: టీఆర్ఎస్ లో చేరే ఆరుగురు ఎమ్మెల్యేలు వీరే...