మంచిర్యాల జిల్లాలో ఆరుగురు సజీవ దహనం.. అనేక అనుమానాలు..
మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మండలంలోని వెంకటాపూర్ గ్రామపంచాయితీ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి తీవ్ర విషాదయం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు.

మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మండలంలోని వెంకటాపూర్ గ్రామపంచాయితీ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి తీవ్ర విషాదయం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అయితే ఆలోపే ఇంట్లో ఉన్న ఆరుగురు సజీవ దహనమమయ్యారు. మృతులను మాసు శివయ్య, అతని భార్య పద్మ, పద్మ అక్క కుమార్తె మౌనిక, మౌనిక పిల్లలు హిమబిందు, స్వీటీలుగా గుర్తించారు. వీరితో పాటు మరో వ్యక్తిని సింగరేణి ఉద్యోగి శాంతయ్యగా గుర్తించారు.
ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఉన్నతాధికారులు.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను గుర్తించిన అనంతరం పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు.
‘‘అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న ఇంట్లో పద్మ, ఆమె భర్త శివయ్య నివసిస్తున్నారు. రెండు రోజుల క్రితం వారి బంధువు మౌనిక, ఆమె ఇద్దరు పిల్లలు వచ్చారు. మరో వ్యక్తి శాంతయ్య కూడా వారి ఇంట్లోనే ఉన్నారు. మంటలు చెలరేగిన సమయంలో ఇంట్లో మొత్తం ఆరుగురు ఉన్నారు. అర్ధరాత్రి 12-12.30 గంటల ప్రాంతంలో ఇంట్లో మంటలు చెలరేగడం గమనించి పక్కింటి వ్యక్తి పోలీసులకు సమాచారం అందించారు. అగ్ని ప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఆరుగురు మృతిచెందారు’’అని మంచిర్యాల ఏసీపీ తిరుపతిరెడ్డి తెలిపారు.
అయితే ఈ ఘటనకు సంబంధించి అనేక అనుమానాలు వెంటాడుతున్నాయి. పద్మకు శాంతయ్యతో వివాహేతర సంబంధం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నట్టుగా చెబుతున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో శాంతయ్య ఇంట్లోనే ఉన్నారు. పద్మ కుటుంబ సభ్యులతో పాటే శాంతయ్య కూడా సజీవదహనం అయ్యారు. ఈ నేపథ్యంలోనే అగ్ని ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా?, ఎవరైనా కావాలనే నిప్పు పెట్టారా? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. శాంతయ్య కుటుంబ సభ్యులను కూడా విచారణ చేస్తున్నామన్నారు.