వరుసగా పరో తరగతి ప్రశ్రాపత్రాల వివాదాల నేపథ్యంలో నేడు జరగనున్న ఇంగ్లీష్ పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లను, భద్రతను మరింత పెంచారు. ప్రతీ పరీక్షా కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేశారు. 

హైదరాబాద్ : వరుసగా రెండు పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాలు పరీక్ష అయిపోకముందే వాట్స్అప్ ద్వారా బయటికి రావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది. రాష్ట్రవ్యాప్తంగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్న 2,652 కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్స్ ని నియమించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే పోలీస్, పంచాయతీరాజ్, రెవెన్యూ సిబ్బందిని కూడా పరీక్షల పర్యవేక్షణకు వినియోగించాలని నిర్ణయించింది. ఈరోజు పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో నేడు జరగబోయే ఇంగ్లీష్ ఎగ్జామ్ తో పాటు మిగిలిన ఎగ్జామ్స్ కు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, పర్యవేక్షణ పెంచాలని ఎస్పీలు, కలెక్టర్లు తమ పరిధిలో ఉన్న పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. 

అదే క్రమంలో క్రిమినల్ కేసులు ఉన్న టీచర్లు, వ్యక్తిగత నేపథ్యం సరిగా లేని టీచర్లను విధుల నుంచి తొలగించాలని కూడా పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన డీఈఓలను ఆదేశించారు. ఎందుకంటే.. తాండూరులో బందెప్ప అనే టీచర్ మీద పోక్సో కేసు నమోదు అయింది. అయినా అతడిని విధుల్లోకి ఎలా తీసుకున్నారన్న విమర్శలు తీవ్రస్థాయిలో వచ్చాయి. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

గుండెపోటుతో 19 ఏళ్ల విద్యార్థి హఠాన్మరణం.. ఖమ్మంలో ఘటన

టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ లో కాపీయింగ్ ను నిరోధించడానికి ఇప్పటివరకు ఫ్లయింగ్ స్క్వాడ్లను మాత్రమే నియమిస్తున్నారు. కానీ, ప్రతి కేంద్రంలోనూ సిట్టింగ్స్ స్క్వాడ్స్ ను నియమించడం ఇదే మొదటిసారి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 4.94 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరికోసం 2,652 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 34,500 మంది ఇన్విజిలేటర్లుగా పరీక్షల విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో సమస్యాత్మక కేంద్రాలుగా 318 పరీక్ష కేంద్రాలను గుర్తించారు. ఈ కేంద్రాల్లోనే నిన్నటిదాకా సిట్టింగ్స్ స్క్వాడ్ లను నియమించారు. 

అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. మిగిలిన 2,334 కేంద్రాల్లో కూడా సిట్టింగ్ స్క్వాడ్లను నియమిస్తున్నారు. దీనికోసం ఎంపీడీవోలు, డిప్యూటీ తహసిల్దార్లు, పోలీస్ అధికారులు, తహసీల్దారులను వినియోగించుకుంటున్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో కూడా ఈ సిట్టింగ్ స్క్వాడ్లు ఇద్దరు చొప్పున ఉంటారు. పరీక్ష ముగిసే వరకు ఈ అధికారులు కేంద్రంలోనే ఉంటారు. దీంతోపాటు పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు పహారానూ పెంచుతున్నారు. ఇక పరీక్షా కేంద్రాల దగ్గర విధుల్లో ఉండే ఏఎన్ఎంలు, పోలీసు సిబ్బంది కూడా సెల్ ఫోన్లు వాడద్దని నిషేధం విధించారు. ఇన్విజిలేటర్లను కూడా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపాలని అధికారులు స్పష్టం చేశారు.

ఇక.. ఎగ్జామ్స్ లో పార్ట్ బి పేపర్.. అంటే 20 మార్కుల బిట్ పేపర్ కు సమాధానాలను చాలా కేంద్రాల్లో ఇన్విజిలేటర్లే చెబుతున్నారని అంటున్నారు. పదో తరగతి విద్యార్థులు చూసి రాస్తున్నా.. కూడా అడ్డుకోవడం లేదని కూడా ఆరోపిస్తున్నారు. దీనిమీద ప్రభుత్వం సీరియస్ గా చర్యలు తీసుకుంది. అలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా.. కాపీయింగ్ జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నా కూడా కఠిన చర్యలు తప్పవని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.