Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు... లాయర్ శ్రీనివాస్‌కు సిట్ నోటీసులు, నిందితులతో ప్రయాణాలపై ఆరా

మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఈ క్రమంలో లాయర్ శ్రీనివాస్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. నిందితులతో కలిసి చేసిన ప్రయాణాలపై ఆరా తీసే అవకాశాలు వున్నాయి. 

sit issued notice to lawyer srinivas in moinabad farm house case
Author
First Published Nov 24, 2022, 9:25 PM IST

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో న్యాయవాది శ్రీనివాస్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. నందూ, సింహయాజీతో కలిసి ఎక్కడెక్కడ ప్రయాణం చేశారో చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నందూ వద్ద రూ.55 లక్షలు అప్పు తీసుకున్నట్లు శ్రీనివాస్ నోటీసులో పేర్కొన్నారు. నందకుమార్‌కు నెలకు రూ.1.10 లక్షలు వడ్డీ చెల్లిస్తున్నట్లు శ్రీనివాస్ తమకు తెలిపారని సిట్ అధికారులు తెలిపారు. వడ్డీ చెల్లిస్తున్న గూగుల్, ఫోన్ పే వివరాలు సమర్పించాలని శ్రీనివాస్‌ను సిట్ ఆదేశించింది. 

ఎక్కడికి వెళ్లినా తనకు నందూనే టికెట్లు బుక్ చేస్తారని శ్రీనివాస్ వెల్లడించినట్లు సిట్ పేర్కొంది. దీంతో నందకుమార్ బుక్ చేసిన విమాన టికెట్ల వివరాలు ఇవ్వాలని సిట్ ఆదేశించింది. విచారణకు వచ్చేటప్పుడు పలు వివరాలు తీసుకురావాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో రేపు విచారణకు హాజరుకావాలని నిన్న శ్రీనివాస్‌ను ఆదేశించింది హైకోర్ట్. ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఈ నెల 21, 22న సిట్ విచారణకు హాజరయ్యారు శ్రీనివాస్. 

Also REad:మొయినాబాద్ ఫాంహౌస్ కేసు .. సింహయాజీపై అభిమానంతోనే ఫ్లైట్ టికెట్ చేశా : లాయర్ శ్రీనివాస్

ఈ నేపథ్యంలో 21న తన శాంసంగ్ ఫోన్‌ను సిట్ అధికారులకు అప్పగించారు శ్రీనివాస్. అయితే జూలై వరకు వాడిన మరో ఫోన్ అప్పగించాలని శ్రీనివాస్‌కు స్పష్టం చేసింది సిట్. పాత ఫోన్ పగిలినందున జూన్ 1న కొత్త ఫోన్ కొన్నట్లు సిట్‌కు తెలిపారు శ్రీనివాస్. ఓ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా విమాన టికెట్లు బుక్ చేసినట్లు సిట్‌కు తెలియజేశారు. అయితే సిట్ అప్పగించిన మొబైల్ ఫోన్‌లోనే ట్రావెల్ ఏజెన్సీ వివరాలు వున్నాయని శ్రీనివాస్ చెప్పారు. దీంతో శ్రీనివాస్, ఆయన భార్య బ్యాంకుల ఖాతాల వివరాలు, పాస్‌పోర్ట్ ఇవ్వాలని సిట్ ఆదేశించింది. 

అంతకుముందు కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్‌ను సిట్ అధికారులు సోమ, మంగళవారాల్లో రెండు రోజుల పాటు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడు సింహయాజీపై వున్న అభిమానంతోనే టికెట్ బుక్ చేసినట్లు తెలిపారు. తనకు బీజేపీతోనూ, ఫాంహౌస్‌ కేసుతోనూ ఎలాంటి సంబంధం లేదని శ్రీనివాస్ వెల్లడించారు. గతంలో పూజలు చేయించుకునేటప్పుడు సింహయాజీతో పరిచయం ఏర్పడినట్లు తెలిపారు. సిట్ అధికారుల దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తానని శ్రీనివాస్ పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios