టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ స్కాం: మరో ముగ్గురు అరెస్ట్
టీఎస్‌పీఎస్‌పీ పేపర్ లీక్ కేసులో మంగళవారంనాడు మరో ముగ్గురిని సిట్ అరెస్ట్ చేసింది. దీంతో ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య 77కి చేరింది.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో మంగళవారంనాడు మరో ముగ్గురిని సిట్ అరెస్ట్ చేసింది. విద్యుత్ శాఖలో డీఈగా పనిచేసిన రమేష్ నుండి వీరు ఏఈఈ పరీక్ష పేపర్ ను తీసుకున్నట్టుగా సిట్ గుర్తించింది. పరీక్ష రాసి ఉద్యోగం వచ్చిన తర్వాతే డబ్బులు ఇవ్వాలని రమేష్ వీరితో ఒప్పందం చేసుకున్నాడు. సుమారు 30 మందికి రమేష్ ఏఈఈ పరీక్ష పేపర్ ను ఇచ్చినట్టుగా సిట్ గుర్తించింది. నిన్ననే 19 మందిని సిట్ అరెస్ట్ చేసింది. ఇవాళ ముగ్గురిని అరెస్ట్ చేసింది సిట్. ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య 77కు చేరుకుంది.
తొలుత టీఎస్‌పీఎస్‌సీలోని కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయని అనుమానించారు. కానీ పేపర్ లీకైందని పోలీసులు గుర్తించారు. కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయని ఈ ఏడాది మార్చి మొదటి వారంలో జరగాల్సిన రెండు పరీక్షలను టీఎస్‌పీఎస్‌సీ వాయిదా వేసింది.పేపర్ లీక్ అయినట్టుగా గుర్తించడంతో రద్దు చేసిన, వాయిదా వేసిన పరీక్షలను తిరిగి నిర్వహిస్తున్నారు. ఇటీవలనే గ్రూప్-1, గ్రూప్ -4 పరీక్షలను టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించింది.
also read:టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ స్కాం: మరో 19 మంది అరెస్ట్
ఈ పేపర్ లీక్ కేసులో ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్టుగా సిట్ గుర్తించింది. ఈ పేపర్ లీక్ కేసులో ఈడీ కూడ రంగ ప్రవేశం చేసింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా ఈడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జైల్లో ఉన్న ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిని కూడ ఈడీ అధికారులు ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్‌సీ చైర్మెన్ జనార్థన్ రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్ సహా పలువురు ఉద్యోగులను కూడ ఈడీ ప్రశ్నించింది.