కేటీఆర్‌తోనే సాధ్యమైంది.. 18 ఏళ్లు జైలులో.. దుబాయ్ నుంచి తెలంగాణకు తిరిగొచ్చిన కార్మికులు
కేటీఆర్ చేసిన కృషితో ఓ హత్య కేసులో దుబాయ్ జైలులో 18 ఏళ్లు మగ్గిన సిరిసిల్ల వలస కార్మికులు ముందస్తుగా విడుదలయ్యారు. వారు శంషాబాద్ ఎయిర్ పోర్టు చేరగానే కుటుంబ సభ్యులతో కలిసినప్పుడు భావోద్వేగ వాతావరణం ఏర్పడింది. అందరూ కన్నీటిపర్యంతమయ్యారు.
KTR: తెలంగాణ నుంచి గల్ఫ్‌కు ఉపాధి నిమిత్తం వెళ్లే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఉపాధిని వెతుక్కంటూ ఇక్కడి నుంచి చాలా మంది గల్ఫ్ దేశాలకు వెళ్లుతుంటారు. ఇలాగే.. శివరాత్రి మల్లేశ్, శివరాత్రి రవి, దుండుగుల లక్ష్మణ్, శివరాత్రి హన్మంతు, వెంకటేశ్‌లు దుబాయ్‌కు వెళ్లారు. అయితే.. అక్కడ నేపాల్ నుంచి వచ్చిన బహదూర్ సింగ్ అనే గూర్ఖా హత్య జరిగింది. ఈ హత్య కేసులో ఈ ఐదుగురికి పాతికేళ్ల జైలు శిక్ష పడింది. అయితే.. వీరిని కేసు నుంచి తప్పించడానికి, తిరిగి తెలంగాణకు తీసుకురావడానికి కేటీఆర్ తీవ్రంగా కృషి చేశారు.
వీరంతా సిరిసిల్ల నుంచి గల్ఫ్ దేశానికి వెళ్లినవారే. కేటీఆర్ కూడా సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు గతేడాది సెప్టెంబర్ కేటీఆర్ దుబాయ్ పర్యటించారు. అప్పుడే ఈ విషయంపై దుబాయ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ చేసిన ప్రయత్నాలకు యూఏఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. వారి క్షమాభిక్ష పిటిషన్‌ను యూఏఈ ప్రభుత్వం ఆమోదించింది.
వీరంతా ఇప్పటికే 18 ఏళ్లు దుబాయ్ జైలులో శిక్ష అనుభవించారు. శివరాత్రి మల్లేశ్, అతడి సోదరుడు శివరాత్రి రవి శంషాబాద్ ఎయిర్ పోర్టు చేరుకున్నారు. కుటుంబ సభ్యులు వారిని చూడగానే.. అక్కడంతా భావోద్వేగ వాతావరణం ఏర్పడింది. కుటుంబ సభ్యులు అందరూ కన్నీటి పర్యంతమయ్యారు. రెండు నెలల క్రితమే దుండుగల లక్ష్మణ్ తెలంగాణకు వచ్చాడు. కాగా, వెంకటేశ్ వచ్చే నెలలో దుబాయ్ జైలు నుంచి విడుదల కానున్నాడు.
కేటీఆర్ వల్లే ఇది సాధ్యమైందని, సిరిసిల్ల వాసులను ముందస్తుగానే విడుదల చేయించడంలో ఆయన శ్రమ ఉన్నదని స్థానికులు చెప్పుకుంటున్నారు.