తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల జాతర జరుగుతోంది. గత మూడు నెలల్లోనే అసెంబ్లీ, పంచాయితీ, పార్లమెంట్ ఎన్నికలు జరగ్గా వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈసి ఏర్పాట్లను కూడా ముమ్మరం చేసింది. దీంతో మరోసారి రాజకీయ నాయకులు ప్రజల వద్దకు పరుగులు తీశారు. అయితే తెలంగాణలో జరిగే ఏ ఎన్నిక అయినా సిద్దిపేటలో మాత్రం టీఆర్‌ఎస్‌దే విజయం. ఇందుకు స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావే  కారణమన్న విసయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

ఏ చిన్న నిర్ణయమైన ప్రతి ఒక్కరి అంగీకారంతో చేసే ఆయనంటే సిద్దిపేట ప్రజలకు అపారమైన నమ్మకం. అందువల్లే ప్రతి ఎన్నికల సమయంలో తన సొంత నిర్ణయాలు కాకుండా పార్టీ నాయకులు, కార్యకర్తల అభీష్టం మేరకే నడుచుకునే హరీష్ ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల్లోనూ అదే పంథాను అనుసరిస్తున్నారు. 

బుధవారం సిద్దిపేటలో టీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశమైన హరీష్ జడ్పిటిసి, ఎంపిటీసి ఎన్నికలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...జెడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా పోటీ చేయాలనే కూతూహలం, ఆశ ప్రతి ఒక్కరిలో వుంటుందన్నారు. కానీ అలా ఆశించే వారికి ఇదే చివరి అవకాశం కాదని...భవిష్యత్ లో ఇంకా చాలా మంచి పదవులు వరించే అవకాశాలు వారికి వుంటాయన్నారు. కాబట్టి అందరు పార్టీ నిర్ణయించిన వారికి మద్దతుగా నిలబడి గెలిపిస్తే మనపై గౌరవం మరింత పెరిగి మంచి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. 

సిద్దిపేట నియోజకవర్గంలో సైనికుల్లాంటి కార్యకర్తలు, నమ్మకస్తులైన ఓటర్లు ఉన్నారన్నారు. వాళ్లే తన వెంట నిలబడి బలాన్నిస్తున్నారని... ఉద్యమ కాలం నుండి ఇప్పటివరకు తనవెంటే నడుస్తున్నారని గుర్తుచేసుకున్నారు. వారి తనకు అందించిన ప్రేమ, అనురాగాలను తాను ఎప్పటికీ మరిచిపోనని భావోద్వేగానికి హరీష్ లోనయ్యారు. 

ఎప్పటి మాదిరిగానే ఇప్పుడు కూడా అందరం కలసికట్టుగా పనిచేసి అన్ని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలను అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు. అభ్యర్థులను  గ్రామస్తులు, పార్టీ పెద్దలు సమావేశమై ఖరారు చేస్తారన్నారు. అందరి ఆమోదంతోనే అభ్యర్థులను నియమించుకుని గెలిపించుకోవాలని... ఆ తర్వాత గెలిచిన అభ్యర్థితో అలాగే పనిచేయాలని సూచించారు. నియోజకవర్గ పరిధిలోని మొత్తం 5 జడ్పీటీసి, 45 ఎంపిటీసి స్ధానాలు టీఆర్ఎస్ ఖాతాలోనే పడాలని హరీష్ సూచించారు.