తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వైరస్‌పై పోరాటానికి కావాల్సిన వ్యాక్సిన్, బెడ్స్, ఆక్సిజన్ వంటి సామాగ్రి కొరత ఆసుపత్రులను వేధిస్తోంది. ఇదే సమయంలో అసలు వైరస్ సోకిందో లేదో నిర్ధారించే యాంటిజన్ కిట్స్ రాష్ట్రంలో నిండుకున్నట్లుగా తెలుస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో యాంటిజన్ కిట్స్ లేకపోవడంతో వైద్య సిబ్బంది పరీక్షల కోసం వస్తున్న జనాలను వెనక్కి పంపిస్తున్నారు. హైదరాబాద్ శివార్లలోని వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో కరోనా టెస్టుల కోసం రోగులు బారులు తీరారు.

పైగా బుధవారం శ్రీరామనవమి సెలవు రోజు కావడంతో ఆస్పత్రి రద్దీ మరింత పెరిగింది. కొన్ని సెంటర్లలో ఈ రోజు వరకూ కిట్స్ ఉండగా.. మరికొన్ని సెంటర్లలో కిట్లు నిండుకున్నాయి.

Also Read:ఇకపై కరోనా కేసులు తగ్గుముఖం...కారణమిదే: మంత్రి ఈటల

అటు యాంటిజన్ కిట్స్, అటు వ్యాక్సిన్ నిల్వలు నిండుకోవడంతో రోగుల్ని వెనక్కి పంపిస్తున్నారు. కిట్స్ తెప్పించడంలో ప్రభుత్వం విఫలమైందని పలువురు మండిపడుతున్నారు. మరోవైపు ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్యను కూడా ప్రభుత్వం పెంచడం లేదు. పరీక్షలు చేయించుకున్నప్పటికీ ఫలితాలు వారం రోజుల పాటు రావడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

మరోవైపు తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 6,542 పాజిటివ్‌ కేసులు నమోదవగా.. 20 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 2,887 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 46,488 యాక్టివ్‌ కేసులున్నాయని పేర్కొంది.