రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి. ఫిల్మ్ స్టార్లను తలదన్నే రీతిలో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్ ఎంతగా అంటే వినాయక చవితి సందర్భంగా ఆమె ఒడిలో గణేషుడు కూర్చున్నట్లు ప్రతిమ తయారు చేసే వరకు వెళ్ళింది. అయితే ఇప్పుడు ఆమె ఫ్యాన్స్ కు ఒకింత షాకింగ్ న్యూస్ చెప్పక తప్పదు. అదేమంటే..?

నిన్నటి వరకు ఆమ్రపాలి.. అంటే కుమారి కలెక్టర్ గా సేవలందించారు. దూకుడులో.. ఆమెకు ఆమే సాటిగా నిలిచారు. కానీ.. ఇప్పుడు కుమారి కలెక్టర్ సెలవులో ఉన్నారు. ఈనెల 15 నుంచి అంటే నేటినుంచే కలెక్టరమ్మ సెలవులోకి వెళ్లిపోయారు. అంటే కుమారి ఆమ్రపాలి సెలవు పెట్టి వెళ్లారు. మార్చి 8న ఆమె విధుల్లో చేరనున్నారు. అంటే మర్చి 8న సెలవుపై వెళ్లిన కుమారి కలెక్టర్.. శ్రీమతి ఆమ్రపాలిగా వచ్చి విధుల్లో చేరనున్నారన్నమాట.

ఈ నెల 18వ తేదీన ఆమ్రపాలి వివాహం ఢిల్లీకి చెందిన ఐపీఎస్‌ అధికారి సమీర్‌ శర్మతో జరుగనుందనే విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 15నుంచి మార్చి 7వ తేదీ వరకు ఆమ్రపాలి సెలవుల్లో వెళ్తున్నారు. 16నుంచి 21వరకు జమ్ముకాశ్మీర్‌లో, 22నుంచి 25వరకు హైదరాబాద్‌లో, 26న వరంగల్‌ను సందర్శిస్తారు. అనంతరం మార్చి 7వ తేదీ వరకు టర్కీలో పర్యటిస్తారు. మార్చి 8న విధుల్లో చేరనున్నారు. ప్రస్తుతం కలెక్టర్‌ అమ్రపాలి వరంగల్‌ అర్బన్ జిల్లాకు కలెక్టర్ గానూ.. అలాగే వరంగల్ రూరల్‌ జిల్లాకు ఇన్‌చార్జి కలెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఆమె సెలవుల్లో వెళ్తుండటంతో అర్బన్‌ జేసీ దయానంద్‌ వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌గా, రూరల్‌ జేసీ హరిత వరంగల్‌ రూరల్‌ జిల్లాకు ఇన్‌చార్జి కలెక్టర్‌గా వ్యవహరిస్తారు.

కలెక్టర్ కుమారి ఆమ్రపాలి పాత్ర ముగిసిపోయింది. ఇక కలెక్టర్ శ్రీమతి ఆమ్రపాలి శకం మొదలుకానుంది. మరి శ్రీమతి అయిన తర్వాత ఇదే దూకుడు ప్రదర్శిస్తారా? లేదంటే కొత్త రకమైన పాలన సాగుతుందా అన్నది తెలియాలంటే మార్చి 8వరకు ఆగాల్సిందే.