ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఎంపీ.. తమ గ్రామంలోకి అడుగుపెట్టడానికి వీలులేదంటూ.. ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కాడు. ఆ తర్వాత ఎంపీ రావడం లేదని తెలుసుకొని.. అతనే కిందకు దిగి వచ్చాడు. ఈ సంఘటన ముదిగొండ మండలం గోకినపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గోకినపల్లి గ్రామంలో గురువారం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కమలరాజు ఎన్నికల ప్రచారం ఉంది. ఈ ప్రచారంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొనాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి.. తమ కాలనీలో రోడ్లు అధ్వానంగా ఉన్నా ఎంపీ పట్టించుకోలేదని ఆరోపిస్తూ.. ఆయన తమ గ్రామానికి రావొద్దంటూ సెల్‌టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. 

అయితే.. కాసేపటి తర్వాత ఎంపీ శ్రీనివాసరెడ్డి రావడం లేదని తెలుసుకొని కిందకు దిగిరావడంతో దిగివచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నాగరాజును అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో కమలరాజు ప్రచారం ప్రశాంతంగా సాగింది.