shilpa chowdary Case : రేపు విచారణకు హాజరుకానున్న ప్రముఖులు.. ఇప్పటికే నోటీసులు, ‘‘రాధిక’’పైనా ఆరా
కిట్టీ పార్టీల పేరుతో సినీ, రాజకీయ ప్రముఖులకు రూ.కోట్లలో టోకరా పెట్టిన శిల్పా చౌదరి కేసుకు సంబంధించి పోలీసులు కూపీ లాగుతున్నారు. సోమవారం మరికొంతమంది ప్రముఖులను విచారించే అవకాశం కనిపిస్తోంది.
కిట్టీ పార్టీల పేరుతో సినీ, రాజకీయ ప్రముఖులకు రూ.కోట్లలో టోకరా పెట్టిన శిల్పా చౌదరి కేసుకు సంబంధించి పోలీసులు కూపీ లాగుతున్నారు. సోమవారం మరికొంతమంది ప్రముఖులను విచారించే అవకాశం కనిపిస్తోంది. విచారణ సందర్భంగా శిల్పా చౌదరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తులో ముందుకు వెళ్తున్నారు పోలీసులు. తమ ముందుకు విచారణకు హాజరుకావాలని ఇప్పటికే పోలీసులు నోటీ జారీ చేశారు. దీంతో రేపు కొందరు వ్యాపారవేత్తలు విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. శిల్ప కేసులో తమను మోసం చేసిందని ఇప్పటికే పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బ్లాక్ మనీ కావడంతో ఫిర్యాదు చేయడానికి పలువురు ప్రముఖులు వెనుకాడుతున్నట్లుగా తెలుస్తోంది.
మరోవైపు శిల్పా చౌదరి (shilpa chowdary) పోలీస్ కస్టడీ శనివారంతో ముగిసింది. దీంతో ఆమెను కోర్టులో ప్రవేశపెట్టి..స్టేట్‌మెంట్ సమర్పించారు పోలీసులు. అనంతరం శిల్పా చౌదరిని చంచల్‌గూడ మహిళా జైలుకు (chanchalguda womens jail) తరలించారు. తన స్థాయిని పెంచుకునేందుకు శిల్ప రకరకాలుగా ప్రయత్నాలు చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. బిల్డప్ కోసం… స్టేటస్ సింబల్‌గా బౌన్సర్లను నియమించుకున్నట్టు ఆమె చెప్పింది.
Also Read:ముగిసిన శిల్పా చౌదరి కస్టడీ.. చంచల్‌గూడకు తరలింపు, రాధికా రెడ్డి వ్యవహారంపై పోలీసుల ఫోకస్
అంతేకాదు ఆమె రెండేళ్లు అమెరికాలో (america) ఉండి వచ్చినట్లు తేలింది. అయితే.. శిల్పా చౌదరి ఎందుకు అమెరికా వెళ్లారు.. ఎవరెవరు వెళ్లారు.. అక్కడ కూడా డీలింగ్స్ చేశారా.. అనే కోణంలోను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘరానామోసం కేసులో రాధికారెడ్డి (radhika reddy) పేరు తెరపైకి రావడం పెద్ద దుమారం రేపుతోంది. ఆమె ఏకంగా పది రూపాయల వడ్డీకి కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నట్టు తేలింది. ఆ డబ్బంతా రియల్ ఎస్టేట్ బిజినెస్ మీదే పెట్టారా.. ఇతర రూపాల్లో మళ్లించారా.. అన్నది లెక్క తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాధికారెడ్డిని పోలీసులు సోమవారం విచారణ చేయనున్నారు.
అంతకుముందు రెండో రోజు కస్టడీలో భాగంగా తనను రాధికారెడ్డి అనే యువతి మోసం చేసినట్లు శిల్ప పోలీసులకు తెలిపింది. ఆమె తన నుంచి రూ.10 కోట్ల వరకు తీసుకుందని శిల్ప వెల్లడించింది. రాధికా రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తోందని పోలీసులకు తెలిపింది. తనకు ఎవరినీ మోసం చేయాలనే ఆలోచన లేదని ఆమె స్పష్టం చేసింది. అందరికీ త్వరలోనే సెటిల్ చేస్తానని శిల్పా చౌదరి పోలీసులకు తెలిపినట్లుగా తెలుస్తోంది.