గణేశ్ నిమజ్జనోత్సవం : మహిళలు, అమ్మాయిలతో పోకిరీల అసభ్య ప్రవర్తన, 400 మందిని పట్టుకున్న షీటీమ్స్
హైదరాబాద్‌లో గణేష్ శోభాయాత్ర వేళ పోకిరిలు రచ్చిపోయారు. మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దాదాపు 400 మంది పోకిరీలపై కేసులు నమోదు చేసినట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.
హైదరాబాద్‌లో గణేష్ శోభాయాత్ర వేళ పోకిరిలు రచ్చిపోయారు. మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఇలాంటి వారిని షీటీమ్ పట్టుకుంది. దాదాపు 400 మంది పోకిరీలపై కేసులు నమోదు చేసినట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. ట్యాంక్‌బండ్ వద్ద నిమజ్జనం ముగిసిందని తెలిపారు. ఈసారి ఖైరతాబాద్ మహా గణపతిని నిర్దేశిత సమయం కంటే ముందే నిమజ్జనం చేశామని సీపీ వెల్లడించారు. జియో ట్యాగింగ్ లెక్కల ప్రకారం పదివేలకు పైగా విగ్రహాల నిమజ్జనం పూర్తి చేశామని సీవీ ఆనంద్ అన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 10 నుంచి 15 శాతం ఎక్కువ విగ్రహాలు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.
ఉత్సవాలకు వచ్చిన మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం, వేధించడం వంటివి చేసిన 400 మంది పోకిరీలను అరెస్ట్ చేశామని సీపీ తెలిపారు. శోభాయాత్రకు కొందరు మద్యం మత్తులో వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా ముస్లిం పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని సీపీ ప్రశంసించారు. గణేశ్ శోభాయాత్రకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అక్టోబర్ 1న ర్యాలీని నిర్వహించుకునేలా ముస్లిం పెద్దలు నిర్ణయం తీసుకున్నారని సీవీ ఆనంద్ చెప్పారు. మిలాద్ ఉన్ నబీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు. మహిళా భద్రతకు పెద్దపీట వేస్తూ చైన్ స్నాచింగ్‌లు, వేధింపులు జరగకుండా చర్యలు తీసుకున్నామని సీపీ చెప్పారు. శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసేందుకు నగర పోలీసులు ఎంతో శ్రమించారని సీవీ ఆనంద్ ప్రశంసించారు.