నాగర్ కర్నూలు: ఓ యువకుడు తన ప్రేయసి నివాసంలో అనుమానాస్పద స్థితిలో శవమై తేలాడు. ఈ సంఘటన నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది. ప్రేయసి ఇంట్లో బుసిరెడ్డి శరత్ కుమార్ రెడ్డి అనే యువకుడు మరణించాడు. వివాహం కాని ఈ 25 ఏళ్ల యువకుడి మరణం స్థానికంగా సంచలనం సృష్టించింది. 

నాగర్ కర్నూలులోని రాఘవేంద్ర కాలనీలో బుసిరెడ్డి చంద్రారెడ్డి నివాసం ఉంటున్నాడు. అదే ఇంట్లో తీగలపల్లికి చెందిన ఓ వ్యక్తి అద్దెకు ఉంటున్నాడు. బుసిరెడ్డి శరత్ కుమార్ రెడ్డికి ఆ వ్యక్తి భార్యతో అక్రమ సంబంధం ఏర్పడింది. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు అద్దె ఇంటి నుంచి వారిని ఖాళీ చేయించారు. ప్రస్తుతం వారు అదే కాలనీలోని మరో ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. 

గురువారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన శరత్ కుమార్ రెడ్డి ప్రేయసి ఇంట్లోని బెడ్రూంలో శవంగా కనపించినట్లు తెలుస్తోంది. ప్రేయసి ఈ విషయాన్ని శరత్ కుమార్ రెడ్డి మిత్రులకు ఫోన్ చేసి చెప్పింది. వారు వెళ్లే సరికి అతను స్పృహ తప్పి పడి ఉన్నాడు. ఆ విషయాన్ని మిత్రులు అతని సోదరుడికి చెప్పారు. 

ఆ తర్వాత శరత్ కుమార్ రెడ్డిని ఆస్పత్రికి తరలించారు. అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే, శరత్ కుమార్ రెడ్డి ప్రేయసి చెబుతున్న మాటలకు జరిగిన సంఘటనకు పొంతన కుదరడం లేదని అంటున్నారు. ఇంటికి వచ్చిన శరత్ తలుపు తెరిచిన వెంటనే బెడ్రూంలోకి వెళ్లాడని, సెల్ ఫోన్స్ కేబుల్ ను మెడకు చుట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె పోలీసులకు చెప్పింది. 

కాగా, శరత్ కుమార్ రెడ్డి ప్రేయసి భర్తపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శరత్ కుమార్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడా, అతన్ని హత్ చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి ప్యాంట్ కు వీర్యం మరకలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 

తన ఇంటి బెడ్రూంలోని పడకపై శరత్ పడి ఉండగా ఫ్యాన్ కు చున్నీ వేలాడుతున్న దృశ్యాన్ని మృతుడి స్నేహితులకు ఆమె చూపించినట్లు తెలుస్తోంది. మూడో అంతస్థులోంచి స్నేహితులు కిందికి వచ్చి శరత్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వచ్చే లోపే ఫ్యాన్ కు వేలాడుతున్న చున్నీని తొలగించారు. ఇది కూడా అనుమానాలకు తావిస్తోంది. 

శరత్ ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించడానికి ఫ్యాన్ కు చున్నీని వేలాడదీసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శరత్ కుమార్ తన ప్రేయసి భర్తతో కలిసి మద్యం సేవించేవాడని మృతుడి తమ్ముడు చెబుతున్నాడు. ఇది హత్యేనని అతను అంటున్నాడు. 

దేశంలో సంచలనం సృష్టించిన స్వాతి రెడ్డి తన భర్తను హత్య చేసిన స్థలంలోని పక్క వీధిలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. మృతుడి తండ్రి బుసిరెడ్డి చంద్రారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.