హైదరాబాద్: తమ పార్టీ నేతలపైనే టీఆర్ఎస్ బోధన్ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మారితే బాగుండునని తమ పార్టీ నేతలే కొందరు అనుకుంటున్నారని ఆయన అన్నారు. తాను వేరే పార్టీలోకి వెళ్లాలని వారు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. 

బిజెపి ఎంపి ధర్మపురి అరవింద్ తో భేటీతో షకీల్ పార్టీ మారుతారంటూ ప్రచారం సాగింది. అందుకు తాను సిద్ధపడినట్లు కూడా షకీల్ తొలుత చెప్పారు. అయితే తర్వాత మాట మార్చారు. ఈ నేపథ్యంలో ఆయన శనివారం తమ పార్టీ నేతలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

తమ ఇంటి పక్కనే ఉండేల నిజామాబాద్ బిజెపి ఎంపీ అరవింద్ ను తాను కలిస్తే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. తాను మారాలనుకుంటే చెప్పే వెళ్తానని అన్నారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం తనకు లేదని ఆయన అన్నారు. గొడ మీద పిల్లిలా తాను ఉండబోనని అన్నారు. 

తాను గతంలో బిజెపి నిజామాబాద్ జిల్లా మైనారిటీ మోర్చాలో పనిచేశానని, తన మీద కేసులు ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని షకీల్ అన్నారు. గతంలో తన మీద ఉన్న రెండు కేసుల్లో తాను నిర్దోషినని నిరూపించుకున్నట్లు ఆయన తెలిపారు. తమ మీద ఒక్క కేసు ఉన్నట్లు నిరూపించినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన అన్నారు.