శబరిమల ఆలయంలోకి మహిళలకు అనుమతి కేరళ ప్రభుత్వ నిర్ణయం తెలుగు రాష్ట్రాల భక్తుల హర్షం

మహిళాలోకం సుదీర్ఘ పోరాటం విజయవంతమైంది. శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు ఇన్నాళ్లుగా వారు చేసిన న్యాయ పోరాటం ఫలించింది. కేరళ ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. పురుషులకు మాత్రమే అనుమతి ఉన్న శబరిమల ఆలయంలోకి ఇకనుంచి మహిళలకు కూడా ప్రవేశం కల్పించేందుకు సిద్ధమైంది. పురుషులతో సమానంగా మహిళలను కూడా ఇకనుంచి ఆలయంలోకి అనుమతిస్తామని సుప్రీంకోర్టుకు కేరళ ప్రభుత్వం నివేదించింది. ఇప్పటి వరకు 10 నుంచి 50 ఏళ్ళ మహిళలకు ఆలయంలోకి ప్రవేశం లేదు. తాజా నిర్ణయం తో అన్ని వయసుల వాళ్లకు ప్రవేశం కల్పించనున్నారు.
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ఇప్పటి వరకు పురుషులకే మాత్రమే ప్రవేశం ఉంది.

సంప్రదాయాలు, నమ్మకాలు, ఆలయ నిబంధనల పేరుతో ఇన్నాళ్లు మహిళలను అయప్ప ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతినివ్వలేదు. దీనిపై చాలా ఏళ్లుగా వివిధ మహిళా సంఘాలు పోరాటాలు సాగించాయి. దేవుడి ముందు కూడా వివక్ష చూపడం సరికాదని వివిధ మహిళా సంఘాలు కలసి కోర్టుకు వెళ్లాయి. దీంతో 2007లో మహిళలను గుడిలోకి అనుమతించేందుకు కేరళ ప్రభుత్వం ఓకే చెప్పింది. అయితే 2014లో ఈ నిర్ణయాన్ని తిరిగి ఉపసంహరించుకుంది. దీంతో మహిళా సంఘాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దేవస్థాన బోర్డు మాత్రం ఆలయ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ వస్తోంది. అయితే కేరళ ప్రభుత్వం కూడా బోర్డు నిర్ణయానికి మద్దతునిస్తూ జులై 11 న సుప్రీంకోర్టు లో అఫిడవిట్ దాఖలు చేసింది. మహిళల నుంచి వస్తున్న వ్యతిరేకతతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం మహిళలను అనుమతిస్తామని తాజాగా అంగీకారం తెలిపింది. ఫిబ్రవరి నుంచి ఈ కేసును పరిశీలిస్తూ వస్తున్న సుప్రీంకోర్టు కూడా దీనికి వ్యాఖ్యానిస్తూ.. శరీరంలో చోటు చేసుకునే క్రియల ఆధారంగా మహిళలపై వివక్ష చూపటం సమంజసం కాదని పేర్కొంది.

పవిత్రత పేరుతో మహిళలను వేరు చేస్తారా అని బోర్డును ప్రశ్నించింది.

తెలుగు రాష్ట్రాల నుంచే ఎక్కువ..

అయ్యప్పమాల ధారణలోనూ, శబరిమల సందర్శించేవారిలో దేశం మొత్తం మీద ఎక్కువగా ఉండేది తెలుగు రాష్ట్రాల వారే. మాల ధారణ సమయంలో ఇక్కడి నుంచే శబరిమలకు తెలుగు రాష్ట్రాల నుంచి దక్షిణ మధ్యరైలేవ ప్రత్యేక ట్రెయిన్లను కూడా ఏర్పాటు చేస్తుంది. ఇక ప్రైవటు ట్రావెలర్స్ సంఖ్య అయితే లెక్కేలేదు. ఏటా రెండు రాష్ట్రాల నుంచి 15 లక్షల మంది శబరిమలను సందర్శిస్తారని అంచనా.. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వ తాజాగా తీసుకున్న నిర్ణయం తెలుగు రాష్ట్రాల భక్తులకు ఎంతో ఊరటనిచ్చే అంశం. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కేరళ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని శబరిమలలో వసతి గ1హం ఏర్పాటుకు నిర్ణయించింది. ఇప్పటికే నిర్మాణ పనులు కూడా మొదలుపెట్టంది.

తెలంగాణ వారికి టోల్ ఫ్రీ నంబర్...మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

దక్షిణాది రాష్ట్రాల దేవాదాయ శాఖ మంత్రుల సదస్సు మంగళవారం తిరువనంతపురంలో జరిగింది. కేరళ సీఎం విజయన్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హాజరయ్యారు. శబరిమలలో భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్లు, సౌకర్యాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. శబరిమలలో ప్లాస్టిక్‌ను నిషేధించాలని విజ్ఞప్తి చేశారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా భక్తులతో పాటు అందరూ సహకరించాలని కోరారు. తెలంగాణ నుంచి వచ్చే శబరిమల భక్తులకు ప్రత్యేక కంట్రోల్ రూమ్, హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.