లైంగిక దాడికి గురయ్యానంటూ సూసైడ్ లెటర్ రాసిపెట్టి ఓ ఇంటర్మీడియట్ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. లైంగిక వేధింపులకు (sexual assault) గురయ్యానంటూ ఒకటి... బ్లడ్ క్యాన్సర్ (blood cancer) తో బాధపడుతున్నానని మరోటి... ఇలా రెండు సూసైడ్ లెటర్లు (suicide letters) రాసిపెట్టి ఇంటర్మీడియట్ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

వివరాల్లోకి వెళితే... నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ గ్రామానికి చెందిన లింగల లక్ష్మణ్ గౌడ్‌-సువర్ణ దంపతుకు కుమారుడు వంశీకృష్ణ(17) హైదరాబాద్ లో చదువుకుంటున్నాడు. హైదరాబాద్ గచ్చిబౌలి సమీపంలోని గౌలిదొడ్డి ప్రాంతంలోని గురుకుల కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. 

ఇటీవల కరోనా థర్డ్ వేవ్ కారణంగా విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో నెలరోజుల పాటు ఇంటివద్దే వున్నాడు వంశీకృష్ణ. ఈ నెల ఆరంభంలో తిరిగి కళాశాల పున:ప్రారంభం కావడంతో 2వ తేదీన హాస్టల్ కు చేరుకుని తర్వాతి రోజునుండి క్లాసులకు హాజరవుతున్నాడు. 

అయితే గత శుక్రవారం రాత్రి తోటి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన వంశీ చాలాసేపటి వరకు చదువుకున్నాడు. మిగతా విద్యార్థులంతా పడుకున్న తర్వాత అర్ధరాత్రి కాలేజీలోని ఓ క్లాస్ రూంలో ఉరేసుకున్నాడు. ఉదయం అతడి స్నేహితులు వంశీకృష్ణ కనిపించకపోవడంతో వెతకగా ఓ తరగతి గదికి లోపలినుండి గడియపెట్టి కనిపిచింది. దీంతో గట్టిగా తోయగా తలుపులు తెరుచుకున్నాయి. లోపల వంశీ ఫ్యాన్ కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించడంతో భయపడిపోయిన విద్యార్థులు హాస్టల్ వార్డెన్ కు సమాచారం అందించారు. 

విద్యార్థి ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని కిందకు దించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. అయితే వంశీకృష్ణ బ్యాగులో రెండు సూసైడ్ లేఖలను పోలీసులు గుర్తించారు. 

ఓ లేఖలో తనపై లైంగిక దాడి జరిగినట్లుగా వంశీ పేర్కొన్నాడు. అమ్మానాన్నలు, స్నేహితులు, ఉపాధ్యాయులు ఎవ్వరితోనూ ఈ విషయాన్ని పంచుకోలేకపోయానని... దీంతో తనకు తానే లోలోపల తీవ్రంగా మదనపడినట్లు పేర్కొన్నాడు. ఈ బాధను ఇక భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. మరో లెటర్ లో తాను బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు వంశీకృష్ణ పేర్కొన్నాడు. 

తమ కొడుకు మృతిపై అనుమానాలున్నాయని బాధిత తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ రెండు సూసైడ్ లెటర్స్ వంశీనే రాసాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని గచ్చిబౌలి పోలీసులు పేర్కొన్నారు. 

ఇదిలావుంటే నారాయణపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. లైంగిక దాడిని ప్రతిఘటించిన యువతిపై ఓ ఉన్నాది నిప్పటించాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన యువతి చికిత్స పొందుతూ మృతిచెందింది.

మద్దూరు మండలానికి చెందిన యువతిపై కోయిల్ మండలం ఇంజమూర్ గ్రామానికి చెందిన వెంకట్రాములు అనే యువకుడు శుక్రవారం రాత్రి లైంగిక దాడికి యత్నించాడు. అయితే యువతి ప్రతిఘటించడంతో వెంకట్రాములు ఆమెకు నిప్పటించాడు. గాయాలతో అరుస్తున్న యువతినికి గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువతి మృతిచెందింది. 

(ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదు. మీకు ఎటువంటి కౌన్సిలింగ్ సహాయం కావాలన్నా ఐకాల్ (9152987821), ఆసరా (09820466726) వంటి సంస్థలను సంప్రదించండి)