భర్తను కోల్పోయి పిల్లల కోసమే ఉద్యోగం చేస్తున్న ఓ సింగరేణి కార్మికురాలు లైంగిక వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ దారుణం పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. 

పెద్దపల్లి: భర్తను కోల్పోయి పుట్టెడు ధు:ఖంలో వున్నా ఆమె ఏనాడూ ఆత్మహత్య ఆలోచన చేయలేదు. ఒంటరిగానే వుంటూ తన కాళ్ళమీద తాను నిలబడాలని భావించింది. కానీ ఒంటరి మహిళను చూస్తే కొందరు మగాళ్లు మృగాలుగా మారతారు. అలాంటి మ‌ృగాల లైంగిక వేధింపులు తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు యత్నించింది. ఈ దారుణం పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. 

పెద్దపల్లి జిల్లా (peddapalli ditrict) గోదావరిఖనికి చెందిన స్వప్న సింగరేణి కార్మికురాలు. రామగుండం ఆర్జి ఏరియా 1 వర్క్ షాపు లో ఆమె పనిచేస్తోంది. ఆమె భర్త చనిపోవడంతో కారుణ్య నియామకంలో ఆమెకు ఉద్యోగం వచ్చింది. భర్త లేకున్నా ఎవరిపైనా ఆదారపడకుండా పిల్లలను పోషించుకోడానికి ఉద్యోగంలో చేరింది. 

అయితే స్వప్న ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని ఓ కార్మిక సంఘం నాయకుడు ఆమెపై కన్నేసాడు. ఆమె పనిచేసే చోట ఫిట్ సెక్రటరీగా వున్న స్వామిదాస్ ఆమెపై వేధింపులకు దిగాడు. తన లైంగిక వాంఛ తీర్చాలంటూ స్వామిదాసు వేదిస్తుండటంతో భరించలేకపోయిన స్వప్న ఉన్నతాధికారులకు పిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే గత నెల 24న అధికారుల ముందే తనను వేధిస్తున్న స్వామిదాస్ ను చెప్పుతో కొట్టి బుద్దిచెప్పింది. 

Video

ఈ ఘటన తర్వాత తనపై కక్ష పెంచుకున్న స్వామిదాస్ నిన్న(గురువారం) రాత్రి రౌడీలను తన ఇంటికి పంపి దాడి చేయించాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తనను విచక్షణారహితంగా కొట్టిన స్వామిదాస్ మనుషులు రాజీకి రావాలంటూ బెదిరించారని కార్మికురాలు తెలిపింది. ఈ బెదిరింపులతో భయపడిపోయిన బాధితురాలు ఇవాళ(శుక్రవారం) జీఎం కార్యాలయం ఎదుటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె ఆత్మహత్యాయత్నాన్ని తోటి కార్మికులు అడ్డుకున్నారు. 

విషయం తెలిసుకున్న స్థానిక మహిళా సంఘాల నాయకులు. తోటి కార్మికులు బాధితురాలు స్వప్నకు మద్దతుగా నిలిచారు. ఆమెను లైంగికంగా వేధించడమే కాదు దాడి చేయించిన స్వామిదాసుపై అధికారులు మరింత కఠిన చర్యలు తీసుకోవడమే కాదు పోలీసులు కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేసారు. ఈ మేరకు జీఎం కార్యాలయం గేటువద్ద కూర్చుని బాధితురాలితో కలిసి ఆందోళనకు దిగారు. 

కేవలం స్వామిగౌడ్ మాత్రమే కాదు గతంలో ఓ సింగరేణి అధికారి కూడా తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు స్వప్న తెలిపింది. భర్త మృతి తర్వాత సింగరేణి సంస్థనుండి రావాల్సిన డబ్బుల కోసం ఇంటికి రావాల్సిందిగా ఓ అధికారి కోరాడని తెలిపింది. తన ఇంటికి వస్తేనే చెక్కు ఇస్తానంటూ నీచంగా వ్యవహరించాడని బాధితురాలు బయటపెట్టింది. ఇప్పుడు ఇలా కార్మికుల హక్కులను కాపాడాల్సిన కార్మిక నాయకుడు స్వామిదాస్ వేధిస్తున్నాడని బాధితురాలు ఆవెదనతో తెలిపింది.

కేవలం పిల్లల కోసమే బ్రతుకున్న తనను లైంగికంగా వేధిస్తుండటం తట్టుకోలేక ఆత్మహత్యకు సిద్దమైనట్లు బాధిత కార్మికురాలు వెల్లడించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, పోలీసులు స్పందించి తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు కన్నీటిపర్యంతమవుతూ వేడుకుంది.